వినడానిక వింతగా ఉన్నా చదవడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజమేనండి. చెంపదెబ్బలకూ ఒక ఛాంపియన్‌షిప్ ఉంది. అన్ని ఆటల పోటిల్లానే దీనికి రూల్స్ ఉంటాయి. గెలిచిన వారికి బహుమతులుంటాయి. విజేతలు పొందే బహుమతులు కూడా చిన్నవేం కాదు. వేల రూపాయలు సొంతం చేసుకోవచ్చు. మూడే మూడు చెంపదెబ్బలు నిర్ణయిస్తాయి. ఓడెదెవెరో గెలిచేదెవరో. మరి ఈ ఛాంపియన్‌షిప్ విశేషాలేంటో తెలుసుకుందామా..తల్లిదండ్రులైన, సోదరులైనా, స్నేహితులైనా, బంధువులైనా....చెంప మీద ఒక్క దెబ్బ కొడితే చాలు ఎవరికైనా కోపం నషాళానికంటుతుంది. ముక్కూ మొహం తెలియనివారైతే ఇంక చెప్పేందుకేముంది. మరుక్షణం వాళ్ల చెంపకూడా ఛెళ్లుమంటుంది. కానీ రష్యాలో నిర్వహించే చెంపదెబ్బల పోటీలో మాత్రం ఎదుటివాళ్లు చెంపమీద చాచిపెట్టికొట్టినా, బాధనీ, కోపాన్నీ పంటిబిగువున ఒత్తిపెట్టి అలాగే నిలబడాలి. అలా నిలబడిగలిగినవాళ్లే ఈ టోర్నమెంట్ విజేతలుగా నిలిచి ఔరా అనిపించుకుని ఆశ్చర్యపరుస్తారు.
వారాంతాల్లో ఆటవిడుపు
ఎక్కడైనా ఇద్దరు వ్యక్తులు గొడవపడుతున్నారంటే ఎవరైనా ఏంచేస్తారు?వాళ్ళెవరో తమకు తెలీకపోయినా తలా ఓ పక్క చేరి నచ్చజెప్పేందుకు, సమాధానపరిచేందుకు ప్రయత్నిస్తారు. రష్యా ప్రజలు మాత్రం ఎదురుగా ఇద్దరు వ్యక్తులు చెంపలు వాయించుకుంటుంటే సరదాగా తలా ఒక్కరిని బలపరుస్తూ వారి అభిమాన పోటీదారుణ్ణి ఈలలతో, చప్పట్లతో ఉత్సాహపరుస్తారు. వారాంతపు రోజుల్లో ఆటవిడుపుకోసం ఇలా చెంపదెబ్బల ఛాంపియన్‌షిప్‌ని నిర్వహిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వింత టోర్నీ రష్యాలోని క్రాస్నోయార్క్ పట్టణంలో నిర్వహిస్తుంటారు. ప్రత్యేకించి వారాంతపు రోజుల్లో రెండు రోజుల పాటు ఈ టోర్నీ కొనసాగుతుంది. టోర్నమెంట్ అనేసరికి కంగారు పడుతుంటారు. చాలామంది పోటీదారులు. కానీ ఈ టోర్నీ మాత్రం వాటన్నింటికీ భిన్నం. పెద్దగా కసరత్తు చేయాల్సిన పని ఉండదు. ప్రత్యర్థిని చాచికొట్టేందుకు చేతుల్లో బలం, ప్రత్యర్థి కొంటే చెంపదెబ్బలను తట్టుకునే సామర్థ్యం ఉంటే చాలు, ఎవరైనా విజేతలుగా నిలవచ్చు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొని, తమ బలాన్ని నిరూపించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. పోటీదారులు. సైబీరియన్ పవర్ షో స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో భాగంగా ఈ టోర్నీని నిర్వహిస్తారు.
ఏదైనా కొత్తగా వింతగా
ఏ ఆట అయినా ఆడినకొద్దీ, చూసినకొద్దీ ఎప్పుడో ఒకప్పుడు బోర్‌గా అనిపిస్తుంది. ఏదైనా కాస్త భిన్నంగా ఉండేదాన్ని ఆదరిస్తారు అందరూ. అందుకే ఈ ఛాంపియన్‌షిప్ నిర్వాహకులు కొత్తగా జనాలను ఆకర్షించేందుకు ఏంచేయాలా అని చర్చించగా స్ఫురించిందే చెంపదెబ్బలాట. బాక్సింగ్ రింగ్‌లో ఒకరినొకరు కొట్టుకోవడం మాములే. కానీ కేవలం చెంపదెబ్బలు మాత్రమే అయితే కొత్తదనం. అందుకే రష్యాకు చెందిన కొందరు వ్యక్తులు ఈ వింత టోర్నీని నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ఎలా కొనసాగుతుందంటే వేదిక మీద ఓ టేబుల్ ఉంటుంది. దానికి చెరో పక్క ఇద్దరు పోటీదారులు నిల్చుంటారు. ఓ కామెంటేటర్ కమ్ అంపైర్ ఉంటారు. ఈ పోటీదారులు ఇద్దరూ పరస్పరం ఒకరి చెంపను ఒకరు పగులుగొట్టాల్సి ఉంటుంది. ఎంత గట్టిగా కొట్టగలిగితే అంతగా టైటిల్‌కు చేరువవుతారు. మూడు సార్లు మాత్రమే ఛాన్స్ ఈ మూడు ఛాన్స్‌లో ఎదురుగా ఉన్న వారి చెంపను పగులుగొట్టాల్సి ఉంటుంది. ఈ మూడు చెంపదెబ్బలతో ప్రత్యర్థిని పడగొట్టేయాల్సిందే. అలా చేసిన పోటీదారుడిని విజేతగా ప్రకటిస్తారు. ఓడినా, గెలిచినా ఈ పోటీలో పాల్గొన్న అందరి గాయాలకీ ఉచితంగానే వైద్యం అందిస్తారు.
ఒక్కరోజులో సెలెబ్రిటీ!
సోషల్ మీడియాలో రాజ్యమేలుతున్న ఈ కాలంలో ఒక్కరోజులో ఎంతోమంది సెలెబ్రెటీలుగా మారిపోతున్నారు. పక్కింటివాళ్లకి కూడా తెలియనివాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అవుతున్నారు. అదేవిధంగా ఈ చెంపదెబ్బల ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి వాసిలీ కామోట్క్సీ అనే 28 ఏళ్ల వ్యక్తి కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అంతేకాకుండా ఇందులో గెలిచినందున బహుమతిగా రష్యన్ కరెన్సీలో ముప్పె వేల రూబుళ్లు అనగా మన రూపాయల్లో ముప్పైరెండు వేలను సొంతం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ టోర్నమెంట్ వీడియోలు వైరల అవడంతో ఓవర్ నైట్ స్టారయ్యాడు వాసలీ.
రూల్స్ నచ్చట్లేదట!
ఈ వింత పోటీగురించి సోషల్ మీడియాలో చర్చబాగానే జరుగుతోంది. ఈ ఆట రూల్స్ అందరికీ నచ్చడంలేదు. ఇంతకీ ఆ రూల్సేంటంటే ..ఇద్దరు పోటీదారులు మూడుసార్లు ఒకరి చెంప ఒకరు వాయించుకోవాలి. ఈ మూడుసార్లలో కిందపడినా, తట్టుకోలేక తుళ్లిపడినా ఎదుటివ్యక్తి గెలిచినట్టే. కొట్టడానికీ రూల్ ఉంది. కొట్టేటప్పుడు చేతివేళ్లతో పాటు కొంత మాత్రమే అరచేతిని ఉపయోగించాలి. పూర్తిగా అరచేతితో కొట్టకూడదు. అయితే ఈ సంవత్సరం విజేతగా నిలిచిన వాసిలీ బరువు 168 కిలోలు. అతని బరువే అతణ్ణి విజేతను చేసిందని కొందరి అభిప్రాయం. అన్ని ఆటల్లోలానే ఇందులోనూ బరువు కేటగిరీలు ఉంటే మరింత బాగుంటుందని కొంతమంది సలహా.
Comments
Please login to add a commentAdd a comment