
టోక్యో : సాధారణంగా ఓ వయసొచ్చాక ప్రతీ ఒక్కరిలో శారీరక దారుఢ్యం గురించి ఒకరకమైన ఆలోచన కలగటం సహజం. చిన్న వయసు నుంచే సరిగ్గా శ్రద్ధా ఉంటే తీసుకుని ఉంటే బావుండు అని తెగ బాధపడిపోతుంటాం. అయితే తమ పిల్లాడి విషయంలో మాత్రం అది జరగకూడదని యుసేయి ఇమై పేరెంట్స్ భావించారు. అందుకే అతన్ని తిరుగులేని యోధుడిగా తీర్చిదిద్దాలని చిన్నప్పటి నుంచే ఫిట్ నెస్ పై శ్రద్ధ పెట్టించారు. ఇప్పుడు ఆ ఏడేళ్ల చిచ్చర పిడుగు.. మినీ బ్రూస్‌లీగా అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు.
జపాన్‌కు చెందిన యుసేయి ఏడాదిన్నర వయసులో ఉండగానే అతని తల్లిదండ్రులు ఎక్సర్ సైజులపై పిల్లాడు దృష్టిసారించేలా చేశారు. అలా కొన్నాళ్లపాటు వాళ్ల పర్యవేక్షణలోనే రాటుదేలిన యుసేయి... నాలుగేళ్లు వచ్చాక సొంతంగా ఫిట్ నెస్ కేర్ తీసుకోవటం ప్రారంభించాడు. ఏడాది నుంచే బ్రూస్‌లీ సినిమాలు చూడటం మొదలుపెట్టిన రైసుయి ఆ ప్రేరణతో మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుని.. ఐదేళ్లకే మార్షల్ కింగ్‌గా మారిపోయాడు. ఈ సిక్స్ ప్యాక్ బుడ్డొడిపై అంతర్జాతీయ మీడియాలు సైతం ప్రత్యేక కథనాలు వెలువరించటం విశేషం.
అతని పంచ్ పవర్ చూసిన మార్షల్ ఆర్ట్స్ నిపుణులు సైతం నోళ్లు వెళ్లబెడుతున్నారు. ఓ 20 ఏళ్ల ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఉండేంత బలం అతని పిడికిలికి ఉందంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం సూపర్ కిడ్స్ అనే ఓ ప్రోగ్రాంలో తన గురువు బ్రూస్ లీ నటించిన గేమ్ ఆఫ్ ది డెత్ చిత్రంలోని ఫైట్ సీక్వెన్స్ ను తీసుకుని.. వెనకాల స్క్రీన్ పై అది ప్రదర్శితమౌతుంటే.. యాజ్ ఇట్ ఈజ్‌గా హవ భావాలతోసహా దానిని ప్రదర్శించి అందరిచేత విజిల్స్ వేయించుకున్నాడు. ఈ వీడియో చూస్తే చాలూ ఇతని టాలెంట్ ఏంటో అర్థమైపోతుంది. ఫైట్లలోనే కాదు.. చదువుల్లో కూడా ఈ పిల్లాడు చాలా చురుకుగా ఉంటాడని టీచర్లు చెబుతున్నారు. అయితే ఫైట్ సమయంలో దూకుడు చూపించే రైసుయి.. తోటి విద్యార్థుల వద్ద మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడని అంటున్నారు.