కౌలాంపూర్లోని ఒక హోటల్లో విమానం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్న ఆ దేశ మంత్రులు హిషాముద్దీన్ హుస్సేన్, జైనుద్దీన్.
కౌలాంపూర్/పెర్త్ : మలేషియా బోయింగ్ 777 విమానం ఎంహెచ్370 కోసం సాగుతున్న అన్వేషణ కీలక దశకు చేరుకుంది. బోయింగ్ శకలాల ఆనవాళ్ల కోసం మినీ రోబో జలాంతర్గామి ‘బ్లూఫిన్-21’ ఏడోసారి హిందూ మహాసముద్రంలో గాలిస్తోంది. శని, ఆదివారాల్లో గాలింపు పరిధిని బాగా కుదించడంతో గాలింపు కీలక దశకు చేరుకుందని మలేసియా రవాణా మంత్రి హిషాముద్దీన్ హుసేన్ తెలిపారు.
బ్లూఫిన్ వారంలోగా అన్వేషణ పూర్తి చేస్తుందన్నారు. బ్లూఫిన్ గాలింపు లోతును 4,500 మీటర్ల 4,696 మీటర్ల లోతుకు పెంచారు. ఐదుగురు భారతీయులు సహా 239 మంది ప్రయాణికులున్న మలేసియా బోయింగ్ గత నెల 8న కౌలాంలపూర్ నుంచి బీజింగ్ వెళ్తూ గల్లంతవడం తెలిసిందే. కౌలాంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్కు బయలుదేరి అదృశ్యమైన ఈ విమానం కోసం 26 దేశాలకు చెందిన వైమానిక, నావికా దళాలు గాలించాయి.