గ్లూకోజ్‌ను గ్రహించే తీరే వేరయా?
మెదడు స్పందన పిల్లలు, పెద్దల్లో భిన్నం
వాషింగ్టన్: గ్లూకోజ్ ద్రవపదార్థంగా తీసుకుంటే తక్షణ శక్తి వస్తుందని ప్రకటనల్లో చూస్తుంటాం. కానీ దాని ప్రభావం పిల్లల్లో ఒకలా, పెద్దల్లో మరోలా చూపిస్తుందని అమెరికాలోని యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు వెల్లడించారు. గ్లూకోజ్ తీసుకున్నప్పుడు పిల్లలు, పెద్దల మెదడు పనివిధానంలో తేడా ఉందని తాము చేసిన పరిశోధనల్లో రుజువైందని చెబుతున్నారు. కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ సమావేశంలో ఈ పరిశోధనల వివరాలను వెల్లడించారు. మెదడులో సానుకూలప్రేరణ, నిర్ణయాత్మక శక్తిని ప్రేరేపించే భాగానికి రక్తప్రసరణ పిల్లలు గ్లూకోజ్ తీసుకున్నపుడు పెరుగుతుందని, అదే పెద్దల్లో అయితే తగ్గుతుందని వివరించారు.
అయితే గ్లూకోజ్ వినియోగం వ్యక్తి ప్రవర్తనపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది తాము నేరుగా వెల్లడించలేమని, గ్లూకోజ్‌తో పెద్దలు, పిల్లల్లో వచ్చే స్పందనలో తేడాలను మాత్రమే కనుగొన్నామని ప్రధాన పరిశోధకుడైన మెడిసిన్, పీడియాట్రిక్స్ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ అనియా జాస్త్రేబోఫ్ వివరించారు. తినే పదార్థాల ద్వారా షుగర్స్ వినియోగంలో పెద్దలదే పెద్ద పాత్ర అన్నారు. అయితే షుగర్స్ ఉన్న ద్రవపదార్థాల వినియోగంతో పిల్లల మెదడులో కలిగే స్పందనలను కొనగొనడంలో తమ ప్రయోగం ఒక ముందడుగు అని, ఊబకాయం పెరుగుదలకు దీనితో సంబంధం ఉందని చెప్పారు.