విమానాశ్రయంపై తాలిబన్ల దాడి.. 37 మంది మృతి
కాందహార్ విమానాశ్రయంపై తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేయడంతో 37 మంది మరణించారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో సాధారణ పౌరులతో పాటు అఫ్ఘాన్ సెక్యూరిటీ దళాల సభ్యులు కూడా ఉన్నారు. చాలా సేపటి నుంచి భద్రతా దళాలకు, తాలిబన్లకు మధ్య కాల్పులు జరుగుతున్నాయని, మొత్తం 10 మంది తాలిబన్లను భద్రతా దళాలు కాల్చి చంపాయని అఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అయితే.. గడిచిన 24 గంటల్లో కాందహార్ ఎయిర్‌పోర్టు మీద తాలిబన్లు దాడి చేయడం ఇది రెండోసారి. మంగళవారం కూడా తాలిబన్లు కాందహార్ పోలీసుస్టేషన్‌ను ముట్టడించి, ముగ్గురు పోలీసు అధికారులను హతమార్చారు. దాడికి పాల్పడిన వారిలో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు హతమార్చారు.
తాజా దాడిలో.. భారీ భద్రతతో ఉండే విమానాశ్రయ ప్రాంగణంలోని కీలక ప్రాంతానికి చేరుకున్న కొంతమంది ఉగ్రవాదులు.. తొలుత ఆ ప్రాంగణంలో ఉన్న ఓ స్కూలు, నివాస ప్రాంతంలో పొజిషన్లు తీసుకున్నారని అధికారులు చెప్పారు. ఒకవైపు ఇస్లామాబాద్‌లో ఆసియా ప్రాంతీయ భద్రతా సదస్సు జరుగుతుండగానే మరోవైపు అఫ్ఘాన్‌లో ఈ దాడి జరగడం గమనార్హం. ఇస్లామిక్ ఉగ్రవాదుల చొరబాట్లతో పోరాడేందుకు తమకు మరింత ప్రాంతీయ మద్దతు కావాలని సదస్సులో అఫ్ఘాన్ అద్యక్షుడు అష్రఫ్ ఘనీ కోరారు.
సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు ఏకే 47 అసాల్ట్ రైఫిళ్లతో విరుచుకుపడ్డారు. వాళ్లందరినీ హతమార్చిన తర్వాత.. అఫ్ఘాన్ ప్రత్యేక బలగాలు అక్కడ మోహరించి మొత్తం విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకున్నాయి. స్థానికులు ఎవరినీ ఉగ్రవాదులు బందీలుగా చేయకుండా ముందుజాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నారు.