మిర్యాంగ్ : దక్షిణకొరియాలోని ఓ ఆస్పత్రిలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో సుమారు 40 మంది రోగులు మృతిచెందారు. ప్రఖ్యాత మిర్యాంగ్ నగరంలోని సెజాంగ్ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చెలరేగిన మంటలు.. నిమిషాల్లోనే ఆరంతస్తుల భవనాన్ని బూడిద చేశాయి. ‘‘ఈ ఘటనలో 40 మంది చనిపోగా, మరో 60 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 16 మంది పరిస్థితి విషమంగా ఉంది’ అని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో సుమారు 200 మంది రోగులు ఆస్పత్రిలో ఉన్నారు.
అందరినీ కాపాడలేకపోయాం.. : ‘‘రెండో అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డులో మంటలు రావడం చూశాం. మరుక్షణంలో ఫైర్ అలారం మోగింది. అక్కడి రోగుల్ని వడివడిగా బయటికి తీసుకొచ్చేప్రయత్నం చేశాం. అంతలోనే మంటలు పై అంతస్తులకు వ్యాపించాయి. ఎటుచూసినా దట్టమైన పొగ.. ఊపిరాడని పరిస్థితి. ఎలాగోలా 100 మందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చాం. మంటలు పెరిగిపోవడంతో అందరినీ కాపాడలేకపోయాం’’ అని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. సెజాంగ్ నుంచి బయటికి తీసుకొచ్చిన రోగులను సమీపంలోని ఇతర ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
అధ్యక్షుడి ఎమర్జెన్సీ మీటింగ్ : సెజాంగ్ ఆస్పత్రిలో ఘోర ప్రమాద ఘటనపై ఉత్తరకొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ విచారం వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే.. అందుబాటులో ఉన్న అధికారులతో ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. సహాయకార్యక్రమాలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. 2008 నాటి సబ్‌వేస్టేషన్ అగ్నిప్రమాదం తర్వాత దక్షిణ కొరియాలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం సెజాంగ్ ఆస్పత్రిదే కావడం గమనార్హం. నాటి సబ్‌వే ప్రమాదంలో 192 మంది ప్రాణాలుకోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment