గేమర్ గర్ల్స్‌కు కావల్సినంత డబ్బు, కానీ...
సిడ్నీ: ఆకర్షణీయమైన ఉద్యోగం, లక్షల్లో జీతాలు, అంతకన్నా ఎక్కువ స్పాన్సర్‌షిప్‌లు, అప్పుడప్పుడు డొనేషన్లు వెరసి లెక్కలేనంత డబ్బు. అందమైన ఫ్లాటు. ఆడపిల్లలకు జీవితంలో ఇంతకన్నా ఏం కావాలి అని అనుకొంటారు ఎవరైనా. అయితే ఈ జీవితాన్ని అనుభవిస్తున్న ఆస్ట్రేలియా వీడియో గేమ్ అమ్మాయిలు మాత్రం మౌనంగా ఏడుస్తున్నారు. తమదంతా పైపై మెరుగుల జీవితమని వారు వాపోతున్నారు. కాల్పనిక జగత్తులో, అంటే వర్చువల్ వీడియో గేముల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా మగవాళ్లు లైంగికంగా తమను వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ గేమర్ అమ్మాయిలు తమ కంపెనీలు లేదా వీడియో గేమ్ వెబ్‌సైట్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీడియో గేమ్ లవర్లతో వర్చువల్ వీడియో గేమ్స్ ఆడుతుంటారు. అందుకు వారికి కంపెనీల నుంచి లక్షల్లో జీతాలు, ఉండటానికి అందమైన ఫ్లాటే కాకుండా స్పాన్సర్‌షిప్‌లు వస్తుంటాయి. అప్పుడప్పుడు తమ అభిమానుల నుంచి డొనేషన్లు అందుతుంటాయి. ఆన్‌లైన్ సబ్‌స్క్రిప్షన్లలో కూడా వారికి వాటా లభిస్తుందట. గేమింగ్ ప్రపంచంలో ఎక్స్‌మింక్స్‌గా పరిచయమైన చెల్సియాకు నెలకు ఆరు అంకెల జీతం (డాలర్లలో) లభిస్తుందని, అయినప్పటికీ అభిమానుల వేధింపులకు బాధ కలుగుతుందని చెప్పారు.
‘ మగవాళ్లు ఆట మీద దష్టి పెట్టకుండా నా అందం మీద, నా శరీరం మీద దష్టి ఎక్కువగా పెడతారు. కొందరు లైంగికంగా వేధించేందుకు ప్రయత్నిస్తారు. నేను ఫార్మసీలో డిగ్రీ చదివాను. ఆ ఉద్యోగంకన్నా ఎక్కువ జీతమే ఇక్కడ అందుతుంది. అయితే ఏ నెల ఎంత వస్తుందో తెలియదు. ఒక్కోసారి డొనేషన్లే వెయ్యి డాలర్ల నుంచి ఐదువేల డాలర్ల వరకు వస్తాయి’ అని మూడున్నర లక్షల మంది అభిమానులను కలిగిన చెల్సియా తెలిపారు. ‘ట్విచ్ డాట్ టీవీ’ ఫ్లాట్‌ఫామ్‌పై ఆమె కనిపిస్తారు.
‘మీరు ఇలా బాగుంటారు, అలా బాగుంటారు. దుస్తులు లేకుండా ఇంకా బాగుంటారు. మిమ్మల్ని అలా చూడాలని ఉందంటూ’ వర్చువల్ గేముల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా మగవాళ్లు తనను లైంగికంగా వేధిస్తున్నారని ఆన్‌లైన్‌లో లాసర్‌ఫ్రూట్‌గా పరిచయమైన క్యాథలిన్ వాపోతున్నారు. జీతాలు చెల్లించే యజమాన్యాలు కూడా తమను లైంగికంగా వేధిస్తున్నారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని గేమింగ్ గర్ల్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.