
'అఫ్రిది తలరాతను ట్రంప్ నిర్ణయించలేడు'
ఇస్లామాబాద్: అమెరికా నిఘా సంస్థ సీఐఏ గుర్తించిన అబోటాబాద్ లోని ఆ ఇంట్లోనే అల్ కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ఉన్నాడని నిర్ధారించడంలో కీలక పాత్ర పోషించిన వైద్యుడు, ప్రస్తుతం పాకిస్థాన్ జైలులో ఉన్న డాక్టర్ షకీల్ అఫ్రిదిని రెండు నిమిషాల్లో బయటికి తెప్పిస్తానన్న డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ తీవ్రంగా మండిపడింది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో రిపబ్లికన్ ఫ్రంట్ రన్నర్ పై పాక్ నిప్పులు చెరిగింది. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా యూఎస్ తో స్నేహమే కోరుకునే పాకిస్థాన్ గురించి ట్రంప్ కు ఏమాత్రం అవగాహనలేదని దుయ్యబట్టింది.
'పాకిస్థాన్ కు మనం(అమెరికా) భారీగా నిధులు ఇస్తున్నాం. అందుకని వాళ్లు మన మాట వింటారనే అనుకుంటున్నా. నేను అధ్యక్షుడిగా గెలిస్తే రెండంటే రెండే నిమిషాల్లో పాకిస్థాన్ తో మాట్లాడి డాక్టర్ అఫ్రిదిని విడిపిస్తా' అని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిత్వానికి పోటీపడుతోన్న ట్రంప్ సోమవారం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి చౌదరీ నిసార్ అలీ ఖాన్ ట్రంప్ కామెంట్లపై స్పందించారు.
'చిల్లర విదిల్చినంత మాత్రాన పాకిస్థాన్ అమెరికాకు భయపడుతుందని అనుకోవడం ట్రంప్ పొరపాటు. ఆయనది అలాంటి విదేశాంగ విధానమే అయితే అది శుద్ధతప్పు. ట్రంప్ ఇతర దేశాలను గౌరవించడం నేర్చుకోవాలి' అని హితవు పలికిన నిసార్.. డాక్టర్ అఫ్రిది పాకిస్థాన్ పౌరుడని, అతని తలరాతను నిర్ణయించేది ఇస్లామాబాదే తప్ప డోనాల్డ్ ట్రంప్ కాదని తేల్చిచెప్పారు. ఒకవేళ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైనప్పటికీ ఈ విషయంలో ఏమీ చెయ్యలేడని పేర్కొన్నారు.
పాకిస్థాన్ లోని అబోటాబాద్ లో బిన్ లాడెన్ తలదాచుకున్నాడని తెలుసుకున్న అమెరికా నిఘా సంస్థ సీఐఏ.. ఆ విషయాన్ని రూఢీ చేసుకునేందుకు పాకిస్థాన్ జాతీయుడే అయిన డాక్టర్ షకీల్ అఫ్రిది సాయం తీసుకుంది. వ్యాక్సిన్ నెపంతో అఫ్రిదిని లాడెన్ ఉంటోన్న ఇంటిలోపలికి పంపిన సీఐఏ.. అక్కడి పరిస్థితులపై ఒక అంచనాకు వచ్చింది. తర్వాత కొద్ది రోజులకే ఆ ఇంటిపై దాడిచేసి లాడెన్ ను మట్టుపెట్టింది. ఆపరేషన్ క్రమంలో 'సీఐఏ డాక్టర్' గా పేరుపొందిన అఫ్రిదిని పాక్ ప్రభుత్వం దేశద్రోహం ఆరోపణలపై అరెస్ట్ చేసి జైలులో పెట్టింది. విచారణ పేరుతో ఐదేళ్లుగా జైలులో మగ్గిపోతోన్న షకీల్ అఫ్రిదీని బయటికి తీసుకొస్తానని ట్రంప్ వ్యాఖ్యనించడంతో మరోసారి అతను వార్తల్లోకెక్కాడు.