ప్రమాదానికి గురైన విమాన శకలాలను చూపుతున్న సహాయ సిబ్బంది
జకార్తా : ఇండోనేషియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి గంటలు గడిచిన నేపథ్యంలో... ఎవరూ బతికుండే అవకాశం లేదని అధికారులు ప్రకటించారు. సముద్రంలో విమాన శకలాలతోపాటు కొన్ని శరీర భాగాలను కూడా గుర్తించినట్టు తెలిపారు. జావా సముద్రంలో రెస్క్యూ టీమ్స్ ఎమర్జెన్సీ బోట్లతో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. విమానం మెయిన్‌బాడీ కూలిన చోటు కోసం గాలిస్తున్నాయి. బ్లాక్‌బాక్సులు స్వాధీనం చేసుకునేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు.
సాంకేతిక లోపం
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోడానికి కొన్ని క్షణాల ముందు.. వెనక్కి వచ్చేయాలని పైలట్‌కు కమాండ్ ఇచ్చినట్టు జకార్తా ఎయిర్‌పోర్ట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదానికి గురైన JT 610 విమానానికి గత ప్రయాణంలో సాంకేతిక లోపం తలెత్తినట్టు తెలిసింది. సముద్రంలో కుప్పకూలిన సమయంలో ఫ్లైట్‌లో మొత్తం 189మంది ఉన్నారు.
అపార అనుభవం ఉన్నా..
ఇండోనేషియాలో ఘోర ప్రమాదానికి గురైన విమానానికి ఢిల్లీకి చెందిన వ్యక్తి పైలట్‌గా వ్యవహరించారు. ఫ్లైట్ కెప్టెన్ భవ్యే సునేజా ఈ ప్రమాదంలో మరణించినట్టు జకార్తాలోని భారతీయ రాయబార కార్యాలయం ప్రకటించింది. సునేజా మృతికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్ చేసింది. భవ్యే సునేజా అపార అనుభవం కలిగిన పైలట్ అని లయన్ ఎయిర్ పేర్కొంది. కాగా సునేజా మరణించారని అధికారులు ప్రకటించడంతో.. ఢిల్లీలోని అతని కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఢిల్లీలోని మయూర్ విహార్ ప్రాంతానికి చెందిన భవ్యే సునేజా 2011లో లయన్ ఎయిర్ సంస్థలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment