స్లో అండ్ స్టడీ..
ఎక్కడైనా క్యాబ్ వాళ్లు మిమ్మల్ని వేగంగా గమ్యస్థానానికి చేరుస్తాం.. కళ్లు మూసి తెరిచేలోపల మీక్కావాల్సిన చోట దింపేస్తాం అంటూ యాడ్‌లు ఇస్తారు. కానీ జపాన్‌లోని యోకోహామాలో టర్టిల్ ట్యాక్సీ వాళ్లు మాత్రం పేరుకు తగ్గట్లే.. మేం నత్తనడకన పోతాం.. బాగా నెమ్మదిగా ట్యాక్సీ నడుపుతాం.. అరగంటలో వెళ్లాల్సినదానికి గంట సమయం తీసుకుంటాం అని యాడ్ ఇచ్చారు. మన దగ్గరైతే.. టర్టిల్ ట్యాక్సీ అట్టర్ ఫ్లాప్ అయ్యేది. కానీ జపాన్‌లో ఇదో పెద్ద హిట్ అయి కూర్చుంది. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లలతో ప్రయాణించేవారు, సిటీ చూడ్డానికి వచ్చే పర్యాటకులు ఈ ట్యాక్సీకే ఓటేస్తున్నారు. టర్టిల్ ట్యాక్సీ డ్రైవర్లు అతి నెమ్మదిగా.. కుదుపులు లేకుండా కారు నడుపుతారు. దీని కోసం ముందుగా మనం ట్యాక్సీ ఎక్కగానే.. సీటువద్ద ఉండే ఓ బటన్‌ను నొక్కాల్సి ఉంటుంది. దాన్ని నొక్కితే.. నెమ్మదిగా వెళ్లమని డ్రైవర్‌కు సంకేతం పోయినట్లే.. దీనికి బాగా డిమాండ్ పెరగడంతో వచ్చే ఏడాది టోక్యోతోపాటు మరిన్ని నగరాల్లో ఈ సర్వీసును ప్రవేశపెట్టనున్నారు.