‘ప్రేమ’కు చిచ్చు పెడుతున్న స్మార్ట్‌ఫోన్లు
న్యూయార్క్: అమెరికాలో భార్యాభర్తల విడాకుల రేటు 40 శాతం ఉంది. ఇదేమి పెద్ద వార్త కాదు. కలిసి జీవిస్తున్న 60 శాతం భార్యాభర్తల్లో కూడా ఎక్కువ మంది అసంతప్తిగానే బతుకుతున్నారు. కొందరికమో చాలినంత డబ్బు లేదన్నది బాధయితే మరికొందరికేమో సంతప్తికరమైన సెక్స్ దొరకడం లేదన్నది బాధ, ఇంకొంత మందికి పిల్లలు సమయమంతా తినేస్తున్నారన్న బాధ. ఈ బాధలన్నింటికి మూల కారణం స్మార్ట్‌ఫోన్లంటే ఆశ్చర్యం వేస్తుంది. కానీ అదే నిజమంటూ అమెరికాలోని ‘నేషనల్ ఒపీనియన్ రిసెర్చ్ సెంటర్’ ఇటీవల ఓ సర్వే నిర్వహించి మరీ తేల్చింది.
ఇది వరకు భార్యా భర్తలు వారంతపు సెలవుల్లో షికారు కోసం బీచ్ ఒడ్డుకో, పచ్చటి పార్కుకో లేదా ఇష్టమైన రెస్టారెంట్‌కో వెళ్లినప్పుడు ఎంచక్కా చేతిలో చేయి వేసుకొని పొద్దు తెలియకుండా కబుర్లు చెప్పుకునేవారట. పిల్లలతోని వెళ్లినా వారు వారి ఆట, పాట చూసి ముచ్చటపడేవారట. వారి ముద్దుముద్దు మురిపాలను చూసి ఆనంద తన్మయత్నంలో తేలిపోయేవారట. ఇప్పుడు భార్యభార్తలు పార్క్‌లకు, బీచ్‌లకు వెళుతున్నా చేతిలో చేయేసుకోవడానికి వారి చేతులు ఖాళీగా ఉండడం లేవట. ఎందుకంటే వారి చేతుల్లో స్మార్ట్‌ఫోన్లు ఉంటున్నాయట. పిల్లలు తల్లి దండ్రులను పట్టించుకోకుండా డిజిటల్ గేముల్లో మునిగి తేలుతుంటే తల్లిదండ్రులు స్మార్ట్‌ఫోన్లలో ఎప్పటకప్పుడు పోస్టింగ్స్ చెక్ చేసుకుంటున్నారట.
సర్వేలో పాల్గొన్న భార్యాభర్తల్లో 70 శాతం మంది తాము అసంతప్తితోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నామని చెప్పారు. వారి అసంతృప్తికి ప్రధాన కారణమవుతున్నది స్మార్ట్‌ఫోన్ వాడకమేనని లోతుగా అధ్యయనం చేస్తే తేలింది. ప్రతి అమెరికన్ సగటున ప్రతి ఆరున్నర నిమిషాలకొకసారి స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నారు. దాదాపు రోజుకు 150 సార్లు వినియోగిస్తున్నారు. భార్యాభర్తలు అలా మాట్లాడుకుంటూ మంచి రోమాంటిక్ మూడ్‌లోకి వెళుతున్నప్పుడు ఇద్దరిలో ఒకరి మనసు హఠాత్తుగా సెల్‌ఫోన్ వైపు మళ్లుతోంది. అది అందుకుంటే మనసు మరెటో వెళ్లిపోతోంది. ఇది చూసిన భాగస్వామికి తనకన్నా ఫోన్ ముఖ్యమందని విసుక్కుంటున్నారు. చేసేదేమీ లేక తానూ కూడా స్మార్ట్‌ఫోన్ అందుకొని పోస్టింగ్‌లను చూసుకుంటూ గడిపేస్తున్నారు. ఫలితంగా ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ, ఆప్యాయతలు తరగిపోయి, ఆ స్థానంలో అసంతప్తి చోటుచేసుకుంటోంది. ఇంతకు చెప్పేదేమిటంటే స్మార్ట్‌ఫోన్ దూరంగా ఉన్న మనుషులను దగ్గర చేస్తుంటే దగ్గరున్న మనుషులను దూరం చేస్తోంది. మరో విధంగా చెప్పాలంటే ప్రేమికులను దగ్గర చేస్తుంటే, భార్యాభర్తలను దూరం చేస్తోంది.