ఫ్లోరిడా: సాధారణంగా మనలో చాలా మంది చిన్న బల్లిని చూస్తేనే అరచి గోల గోల చేస్తుంటారు. అలాంటిది పామును చూస్తే కచ్చితంగా పై ప్రాణాలు పైనే పోతాయి. కానీ ఒక వ్యక్తి 17 అడుగుల భారీ పైథాన్‌తో పోరాడి దానిని పట్టుకున్నాడు. ఫ్లోరిడాలోని మైక్ కిమ్మెల్ కాంట్రాక్ట్ వేటగాడిగా పని చేస్తున్నాడు. అతడు ఎవర్‌గ్లేడ్స్‌లో ఒక భారీ పామును కనుగొన్నాడు. అయితే దానిని పట్టుకోవడానికి చాలా కష్టపడ్డానని, ఆ సమయంలో తనకి చాలా గాయాలయ్యాయని మైక్ కిమ్మెల్ తెలిపాడు. పైథాన్‌ను ఎలా పట్టుకున్నాడు, తరువాత ఏం జరిగింది అనే దానిని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా అందరితో పంచుకున్నాడు. (వైరల్ వీడియో: ఇద్దరిపై చిరుత పంజా!)
‘నేను భయంకరమైన 17 అడుగుల భారీ పైథాన్ ఎవర్‌గ్లేడ్స్‌లో ఉందని తెలుసుకొని దానిని పట్టుకోవడానికి చిత్తడి నేలలలోకి బయలుదేరాను. ఉదయం 11 గంటలకు అది ఎక్కడ ఉందో తెలుసుకోగలిగాను. అది వెంటనే నాతో పోరాడటం మొదలు పెట్టింది. నాపై దాడి చేసింది. నన్ను గడ్డిలో పడేసింది. దానిని ఓడించడం చాలా కష్టతరంగా మారింది. అది నన్ను కాటు కూడా వేసింది. నా ముంజేతిని, భుజాలను ఆ పైథాన్ గాయపరిచింది. సుదీర్ఘ పోరాటం తరువాత నేను దానిని విజయవంతంగా పట్టుకోగలిగాను’ అని మైక్ కిమ్మెల్ పేర్కొన్నాడు.
సోషల్ మీడియా పోస్ట్‌లో తన చేతికి అయిన గాయాన్ని, రక్తంతో ఉన్న తన ఫోటోను పైథాన్‌తో సహా షేర్ చేశాడు. అయితే దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘రాక్షసిలా ఉంది. దీనిని పట్టుకున్నందుకు ధన్యవాదాలు’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ఇది కచ్చితంగా చాలా భయంకరమైనది అని మరో వ్యక్తి తన అభిప్రాయాన్ని తెలిపారు. మైక్ కాంట్రాక్ట్ స్నేక్ హంటర్ కావడంతో అతనికి పాము పొడవు, ఆకృతి ఆధారంగా బోనస్ లభిస్తుంది. పాములతో పాటు ఆకుపచ్చ ఇగువానా, ఈజిప్టు పెద్దబాతులు, ఫెరల్ హాగ్స్ వంటి ఇతర జాతులను ట్రాప్ చేయడంలో కూడా మైక్ సహాయం అందిస్తుంటాడు. (సూపర్ పవర్స్ చిన్నారి, వీడియో వైరల్!)
యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, స్థానికేతర బర్మీస్ పైథాన్లు దక్షిణ ఫ్లోరిడాలో వాటి సంతతిని పెంచుకొని అక్కడ ఉంటే స్థానిక జీవులను చంపేస్తున్నాయి. వీటి కారణంగా ఆ ప్రాంతంలో చాలా ప్రాణులు మరణించాయి. దీంతో సౌత్ ఫ్లోరిడా వాటర్ మేనేజ్‌మెంట్ డిస్ట్రిక్ట్ పైథాన్ ఎలిమినేషన్ ప్రోగ్రాం మొదలు పెట్టింది. ఇప్పటి వరకు 2,970 పైథాన్‌లను పట్టుకొని బంధించారు.
Comments
Please login to add a commentAdd a comment