ఆ అలవాటును గుర్తించొచ్చు
వాషింగ్టన్: మద్యానికి బానిసయ్యే అవకాశం ఉన్న విద్యార్థులను సామాజిక మాధ్యమాల ద్వారా గుర్తించవచ్చని తాజా అధ్యయనంలో తేలింది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో మద్యానికి సంబంధించి ఎక్కువగా పోస్టింగ్‌లు చేసే విద్యార్థి దానిపై మక్కువ పెంచుకుంటున్నాడని, త్వరలోనే దానికి బానిస అవుతాడని ఈ అధ్యయనంలో తేలింది.
విద్యార్థులు తమ తాగుడు అనుభవాలను పంచుకోవడానికి, అటువంటి ఆలోచన ఉన్నవారిని ఒక దగ్గరకు చేర్చడానికి సామాజిక మాధ్యమాలు వేదికగా ఉపయోగ పడుతున్నాయని అమెరికాలోని నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు లిన్సీ రోమో పేర్కొన్నారు. ఈ అధ్యయనానికి సంబంధించి పరిశోధకులు గత నెలలో ఒక్కసారైనా మద్యం తాగి, ఫేస్‌బుక్, ట్వీటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉన్న 18 ఏళ్ల లోపు వయసున్న 346 మంది అండర్ గ్రాడ్యుయేట్స్‌పై ఆన్‌లైన్ సర్వే నిర్వహించారు.
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల వినియోగం గురించి, ఆల్కహాల్ వినియోగించే మోతాదు, దానివల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మద్యంపై వారి అభిప్రాయం వంటి వాటికి సంబంధించి 30 ప్రశ్నలకు సమాధానాలు తీసుకున్నారు. దీన్ని విశ్లేషిస్తే అధికంగా మద్యం తాగేవారు సామాజిక మాధ్యమాల్లో ఆల్కహాల్‌కు సంబంధించిన పోస్టులు ఎక్కువగా పెట్టినట్లు తేలింది.