స్విచ్ వేస్తే సూర్యుడు వెలుగుతాడు! | solar panels will produce current with screen printing technology | Sakshi
Sakshi News home page

స్విచ్ వేస్తే సూర్యుడు వెలుగుతాడు!

Published Wed, Nov 9 2016 3:36 AM | Last Updated on Mon, Oct 22 2018 8:26 PM

స్విచ్ వేస్తే సూర్యుడు వెలుగుతాడు! - Sakshi

స్విచ్ వేస్తే సూర్యుడు వెలుగుతాడు!

సోలార్ ప్యానెల్స్ గురించి, సౌరశక్తి గురించి మనమిప్పటికే చాలాసార్లు చదువుకుని ఉంటాం. ఇవన్నీ ఇళ్లు, భవనాల పైకప్పులకు, విశాలమైన ప్రాంతాలకూ పరిమితమైనవి. మరి ఇళ్లు, భవనాల్లోపల కూడా ట్యూబ్‌లైట్ల వెలుతురును విద్యుత్తుగా మార్చగలిగితే? ఆ అద్భుతమైన ఆలోచనకు ఆచరణ రూపం ఈ ఫొటోలో కనిపిస్తున్న సోలార్ సెల్ ! ఈయన వర్జీనియా టెక్ శాస్త్రవేత్త కాంగ్‌కాంగ్ వూ. ఈయన చేతుల్లో ఉన్నదే సోలార్ సెల్. కిటీకీ, తలుపు తెరల్లో, లేదంటే గోడలకు అతికించే వాల్‌పేపర్లలోనూ ఈ సెల్స్‌ను ఏర్పాటు చేసుకుంటే పగలు సూర్యకాంతితో... రాత్రవగానే ట్యూబ్‌లైట్ కాంతితో విద్యుత్తు ఉత్పత్తి చేస్తాయివి. అరమిల్లీమీటర్ కంటే తక్కువ మందమున్న ఈ సెల్స్ ఒకొక్కటి (అరచేతి సైజుండేవి) 75 మిల్లీవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలవు.

సాధారణమైన స్క్రీన్ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతోనే వీటినీ ముద్రిస్తారు కాబట్టి... పెద్దగా ఖర్చు కాదు. సిలికాన్ సెల్స్‌తో పోలిస్తే వీటిని చాలా తక్కువ ఉష్ణోగ్రతల వద్దే తయారు చేయవచ్చునని, కాబట్టి తయారీకి అవసరమైన పరికరాలూ తక్కువ ఖర్చుతోనే అందుబాటులోకి వస్తాయని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న శాస్త్రవేత్త శశాంక్ ప్రియ అంటున్నారు. కావాల్సినప్పుడు కావాల్సినంత మోతాదులో ఈ సెల్స్‌ను ప్రింట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ సోలార్ సెల్స్‌తో మిక్సీలు, గ్రైండర్లు, రిఫ్రిజిరేటర్లను నడపలేకపోవచ్చు. ఫోన్లను రీఛార్జ్ చేసుకోవడం మాత్రం సాధ్యమే. ప్రస్తుతం ఈ సోలార్ సెల్స్ తాము అందుకునే కాంతిలో పది శాతాన్ని విద్యుత్తుగా మార్చగలవు. భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని మరింత పెంచగలిగితే.. ఎన్నో ఉపయోగాలుంటాయి. మనం ధరించే దుస్తుల్లోనూ వీటిని చొప్పించే అవకాశం కూడా ఉండటం వల్ల భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్ ఛార్జర్లకు గుడ్‌బై కూడా చెప్పేయవచ్చు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement