‘మద్యం ప్రమాదాలు’ ఏ దేశంలో ఎంత శాతం?
జెనీవా: మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల భారత్‌లాంటి వర్ధమాన దేశాల్లోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మనం భావిస్తాం. కానీ మద్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న దేశాల్లో భారత్ 11వ స్థానంలో మాత్రమే ఉంది. దక్షిణాఫ్రికా దేశం అగ్రస్థానంలో ఉంది.
ఆ దేశంలో ప్రతి లక్ష మందిలో 25.1 శాతం మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తుండగా, ప్రతి పది మంది మృతుల్లో ఆరుగురు మద్యం కారణంగా సంభవించిన రోడ్డు ప్రమాదాల్లోనే మరణిస్తున్నారు. అంటే రోడ్డు ప్రమాదాల్లో 58 శాతం మృతులు మద్యం మత్తులో వాహనాలను నడపడం వల్లనే మృత్యువాత పడుతున్నారు. 2000 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం నాటికి కెనడాలో రోడ్డు ప్రమాదాలు 43 శాతం తగ్గినప్పటికీ మద్యం ప్రభావంతో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎక్కువగానే ఉంటున్నాయి. కెనడాలో రోడ్డు ప్రమాదాల్లో 34 శాతం మరణాలు మద్యం కారణంగానే సంభవిస్తున్నాయి.
ఈ మరణాల శాతం అమెరికాలో 31 శాతం, ఆస్ట్రేలియాలో 30 శాతం, బ్రిటన్‌లో 16 శాతం, జర్మనీలో 9 శాతం ఉన్నాయి. భారత్‌లో ఐదు శాతం, చైనాలో నాలుగు శాతం ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన గ్లోబల్ నివేదికలో వెల్లడించింది. 2015 సంవత్సరం నాటి గణాంకాలనే పరిగణలోకి తీసుకొని ఈ నివేదికను రూపొందించింది.