'కంఫర్ట్ ఉమెన్'కు పరిష్కారం | South Korea, Japan agree to 'irreversibly' resolve WWII 'comfort women' issue in landmark agreement | Sakshi
Sakshi News home page

'కంఫర్ట్ ఉమెన్'కు పరిష్కారం

Published Mon, Dec 28 2015 6:14 PM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

'కంఫర్ట్ ఉమెన్'కు పరిష్కారం

'కంఫర్ట్ ఉమెన్'కు పరిష్కారం

ఏళ్ళ సమస్యకు తెరపడింది. రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి 'కంఫర్ట్ ఉమెన్' సమస్యకు పరిష్కారం దిశగా ఒప్పందం కుదిరింది. దక్షిణ కొరియా, జపాన్ లు తీవ్ర చర్చల అనంతరం అడుగు ముందుకేశాయి. యుద్ధ సమయంలో దక్షిణకొరియా నుంచి మహిళలను బలవంతంగా వ్యభిచార గృహాల్లోకి తరలించిన జపాన్ సైన్యం.. వారిని కంఫర్ట్ ఉమెన్ గా పిలిచేవారు. అయితే ఆ దారుణ కాండకు జపాన్ బాధ్యత వహించాలంటూ దశాబ్దాలుగా కొనసాగుతున్న డిమాండ్ కు ప్రస్తుతం పరిష్కారం కుదిరింది.  కంఫర్ట్ ఉమెన్ సమస్యపై ఇరు దేశాలు ప్రత్యేక ఒప్పందాలు చేసుకున్నాయి.

గతంలో దక్షిణ కొరియాకు క్షమాపణలు చెప్పిన జపాన్ కొన్నాళ్ళపాటు చర్చలు జరిపినా... ఆ తర్వాత స్థబ్దత ఏర్పడింది. ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గియాన్ హై... జపాన్ ప్రధాని షింజో అబేతో సమావేశమై తిరిగి చర్చలను పునరుద్ధరించడంతో ఏళ్ళ సమస్యకు చరమగీతం పాడింది.  జపాన్ తన ఒప్పందం మేరకు బాధ్యతలను నిర్వర్తిస్తే ఈ సమస్యకు ఇదే చివరి ఒప్పందంగా  భావిస్తున్నట్లు సౌత్ కొరియా విదేశాంగ మంత్రి యున్ బైయుంగ్ సే తెలిపారు. జపనీస్ విదేశాంగ మంత్రి ఫ్యుమియో కిషిడాతో చర్చల అనంతరం ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.   

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ దళాలు బానిసలుగా చేసుకున్న మహిళలకు (కంఫర్ట్ ఉమెన్) నష్ట పరిహారంగా ఓ బిలియన్ 'ఎన్' లను  అందించేందుకు జపాన్ అంగీకరించినట్లు కిషిడా తెలిపారు. నిజానికి ఇది నష్ట పరిహారం కాదని, మహిళల గౌరవాన్నినిలబెట్టేందుకు, వారి మానసిక గాయాలను నయం చేసేందకుగా చెప్పాలని కిషిడా అన్నారు. జపనీస్ సైనిక ప్రమేయంతో జరిగిన కంఫర్ట్ ఉమెన్ సమస్య జపాన్ ప్రభుత్వం బాధ్యతగా పరిగణించిందని ఆయన వివరించారు.

 

బాధితులకు జపాన్ ప్రధాని షింజో అబె క్షమాపణలను తెలపడమే కాక పశ్చాత్తాపాన్నికూడ వ్యక్తం చేసినట్లు కిషిడా తెలిపారు. దక్షిణ కొరియా, జపాన్ ల మధ్య కుదిరిన ఈ ఒప్పందం భవిష్యత్తు లో ఇరు దేశాలమధ్య నూతన శకంగా మారుతుందని కిషిడా అన్నారు. ఈ ఒప్పందం తమ దేశానికి  లాభం చేకూర్చడంతోపాటు.. శాంతి, స్థిరాత్వాలను అందించేందుకు దోహద పడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరోవైపు ఒప్పందంలో భాగంగా  జపనీస్ రాయబార కార్యాలయానికి ముందు కంఫర్ట్ ఉమెన్ కు సాక్ష్యంగా ఉన్న విగ్రహాన్ని సంబంధిత ఎన్జీవోలు సంప్రదింపుల ద్వారా తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి బైయున్ సే అన్నారు. సంవత్సరాంతంలో చర్చలు విజయవంతమవ్వడం, 50వ వార్షికోత్సవం దౌత్య సంబంధాలను మెరుగుపరచడం ఎంతో గర్వంగా ఉందని ఆయన అభిప్రాయ పడ్డారు. జపాన్ ప్రధాని షింజో అబే ఆగస్టులో చేసిన ఓ ప్రసంగంలో రెండో ప్రపంచ యుద్ధం ఎంతో బాధాకరమని, భవిష్యత్ తరాలను ఈ సమస్య ఇబ్బంది పెట్టకూడదన్నారని, అది దృష్టిలో ఉంచుకొనే ఈ సంబంధాలను మెరుగు పరచుకొన్నట్లు బైయున్ తెలిపారు.

ప్రస్తుతం ఈ ఒప్పందం విషయాన్ని జపాన్ ప్రధాని షింజో అబే, దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ గియాన్ హై తో ఫోన్లో చర్చించినట్లు తెలుస్తోంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సుమారు 200,000 మంది మహిళలు... అందులోనూ ముఖ్యంగా కొరియా మహిళలు జపాన్ బానిసలుగా మారినట్లు అంచనా.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement