సియోల్: ఒక కాలువలో పడిన బస్సును తీయడానికే నానా హైరానా పడిపోతుంటాం. అలాంటిది సముద్రంలో మునిగిపోయిన పెద్ద నౌకను తిరిగి పైకెత్తాలంటే మాములు మాటలా.. కానీ దక్షిణ కొరియా ఆ పనిచేసింది. 300మందిని పొట్టన పెట్టుకున్న మృత్యునౌకను దాదాపు వెయ్యి రోజుల తర్వాత సముద్ర ఉపరితలంపైకి తెచ్చింది. దాదాపు 6,800టన్నులు ఉన్న దక్షిణ కొరియా భారీ నౌకను రెండు పెద్ద నౌకల సహాయంతో తిరిగి సముద్రంపైకి తీసుకొచ్చింది. మహావిషాదం వెనుక దక్షిణ చేసిన ఈ సాహసాన్ని చూసి అక్కడి వారంతా అబ్బురపడిపోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
అది 2014, ఏప్రిల్ 16. ప్రయాణీకులతో వివాదాస్పద సముద్ర ప్రాంతంలో వెళుతూ అనూహ్యంగా ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో 300 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో విహార యాత్రకు వెళ్లిన విద్యార్థులే ఎక్కువగా ఉండటంతో ప్రపంచ హృదయాలను ఆ ఘటన తీవ్రంగా కలిచి వేసింది. ఆ సమయంలో చాలా రోజులపాటు కష్టపడిన కొరియా ప్రభుత్వం దాదాపు 295 మృతదేహాలను గుర్తించి బయటకు తీసింది. తొమ్మిది మృతదేహాల వివరాలు తెలియరాలేదు. అయితే, ఎలాగైనా తిరిగి ఆ నౌకను బయటకు తీయాలని భావించిన దక్షిణ కొరియా గత మూడేళ్ల కింద నుంచే ఆ పనుల్లో నిమగ్నమైంది.
రెండు పెద్ద పెద్ద నౌకలను తీసుకొచ్చి సరిగ్గా నౌక మునిగిపోయిన ప్రాంతంలో రెండు అటూ ఇటు నిలిపింది. అనంతరం వాటికి ఉన్న క్రేన్‌లను స్టార్ట్ చేసింది. వాటి ద్వారా మొత్తం 66 కేబుళ్లను నీటిలోకి పంపించింది. అప్పటికే ఆ నౌక మునిగి పడిపోయి ఉన్న ప్రాంతంలో సముద్రంలోతు 44 మీటర్లు(145 అడుగులు). ప్రత్యేకమైన డైవర్స్‌ఈ కేబుల్‌ను మునిగిపోయిన నౌకకు బిగించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రెండు క్రేన్ల కేబుళ్లను సమాంతరంగా పైకి లాగారు. ఈ ఆపరేషన్ బుధవారం రాత్రి ప్రారంభించగా గురువారం తెల్లవారు జామున 3.45గంటల ప్రాంతంలో నీటిపైకి కొంచెం కనిపించింది. ఏడుగంటల ప్రాంతంలో మరింతపైకి రావడంతో దానిపైకి డైవర్స్ ఎక్కి అదనంగా కేబుల్స్ అమర్చారు. సరిగ్గా సాయంత్రం 5గంటల ప్రాంతంలో నీటిలో నుంచి 27 అడుగుల పైకి వచ్చింది. దీనిని మరమ్మత్తు కేంద్రం వద్దకు తరలించనున్నారు.
300మందిని మింగిన మృత్యునౌకను తీశారు
Published Thu, Mar 23 2017 6:07 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM
Advertisement