'పుట్టింటి పేరుకోసం పోరాడి ఓడారు'
టోక్యో: జపాన్ సుప్రీంకోర్టు అక్కడి మహిళలను కంట తడిపెట్టించింది. తమ అస్తిత్వాన్ని కోల్పోయామే అనే బాధను కలిగించింది. ఎంతపోరాడినవారిపక్షాన తీర్పురాకపోవడంతో ఆ మహిళలంతా కలత చెందుతూ తీరని వేదనలోకి జారుకున్నట్లుగా మారిపోయారు. పెళ్లిచేసుకున్నవారు కచ్చితంగా ఒకే ఇంటిపేరును కలిగి ఉండాలని జపాన్ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎప్పుడో 19శతాబ్దంలో చేసిన చట్టాన్ని దృఢపరుస్తూ ఇందులో ఎలాంటి మార్పు లేదని పెళ్లయ్యాక తప్పకుండా ఒకే ఇంటి పేరు కలిగి ఉండాలే తప్ప రెండు పేర్లు ఉపయోగించడానికి వీల్లేదని తెలిపింది.
సాధారణంగా ఓ సారి పెళ్లయ్యాక ఏ భర్త అయినా భార్య కోసం ఇంటి పేరు మార్చుకోడు.. భార్య ఇంటి పేరే మారుతుంది. ప్రస్తుతం జపాన్ లో కూడా అందరిలాగానే భర్తల ఇంటి పేర్లే భార్యలకు వర్తిస్తున్నాయి. కానీ, ఎంతోకాలం నుంచి తమకు అత్తింటివారి పేరుతోపాటు, పుట్టిల్లువారి ఇంటిపేరు కూడా కొనసాగించేలా అవకాశం ఇవ్వాలంటూ మహిళలు పోరాడుతున్నారు. ఇటీవల ఐదుగురు మహిళలు సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయగా దానిని విచారించిన ధర్మాసనం తుది తీర్పును వెలువరించింది.
దీంతో పిటిషన్ వేసినవారు కోర్టులోనే గొల్లుమన్నారు. దీంతోపాటు, విడాకులు పొందిన స్త్రీ ఆరునెలలపాటు ఆగాలనే పాత నిబంధనను సుప్రీంకోర్టు కొట్టి వేస్తూ దానిని 100 రోజులకు తగ్గించింది. ఇంటి పేరు విషయంలో తీర్పు అనంతరం క్యోకో సుఖమోతో అనే మహిళ మాట్లాడుతూ 'నేను తీర్పు వినే సమయంలో నా కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. నేను చాలా విచారంగా ఉన్నాను. చాలా బాధగా ఉంది.. నా పేరు.. నా గుర్తింపు..' అంటూ ఆమె కోర్టు ప్రాంగణంలోనే విలపించింది. మరోపక్క, ఎంతోమంది మహిళలు, లింగ సమానత్వ నిపుణులు జపాన్ లోని కొన్ని చట్టాలకు కాలదోషం పట్టిందని, వాటిని మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.