గాజాపై భూతల దాడులు
ఇజ్రాయెల్ దాడులకు ఇళ్ల నుంచి పారిపోయిన వేలాది పాలస్తీనియన్లు
జెరూసలెం: పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ పాలనలోని గాజాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రం చేసింది. ఆదివారం తొలిసారి భూతల దాడులకు దిగింది. దీంతో వేలాది పాలస్తీనియన్లు ఇళ్లు వదలి పారిపోయారు. హమాస్ రాకెట్ దాడులను అరికట్టేందుకు ఇజ్రాయెల్ నౌకాదళ కమాండోలు అరగంటపాటు గాజాలోకి చొచ్చుకె ళ్లి ఓ క్షిపణి ప్రయోగ కేంద్రంపై దాడి చేశారు. దీంతో ఇరు పక్షాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో తమ నలుగురు సైనికులకు స్వల్ప గాయాలయ్యాయని, గాజాలోకి వెళ్లిన తమ సైనికులందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని ఇజ్రాయెల్ తెలిపింది. గాజాలో ఇజ్రాయెల్ బాంబు దాడుల్లో పౌరులు చనిపోవడంపై ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ విచారం వ్యక్తం చేశారు. హమాస్ పాలస్తీనియన్లను మానవ కవచాలుగా వాడుకుంటోందని, దాని రాకెట్ దాడులను అరికట్టేందుకు భారీగా దాడులు చేస్తామని హెచ్చరించారు.