
కొలంబో : శ్రీలంకలో జరిగే పెరిహెరా ఉత్సవాల్లో నదుంగామువా రాజా(65) చేసే సందడి మామూలుగా ఉండదు. బుద్ధుడికి సంబంధించిన వస్తువులను తీసుకువెళ్లే రాజా అంటే భక్తులకు ఎంతో అభిమానం. పదిన్నర అడుగుల ఎత్తు ఉండే ఈ గజరాజును చూడటానికే ప్రసిద్ధ బౌద్ధక్షేత్రం ‘టెంపుల్ ఆఫ్ ది టూత్’కు వచ్చేవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. దేశంలోనే అత్యంత పొడవైన దంతాలు కలిగిన రాజాను శ్రీలంక ప్రభుత్వం కూడా తమ అనధికార జాతీయ సంపదగా భావిస్తుంది. అలాంటి రాజాకు చిన్న ప్రమాదం జరిగినా అభిమానులు తట్టుకుంటారా. అందుకే ప్రభుత్వం అతడికి బాడీగార్డులను నియమించింది. రాజా బయటికి వస్తే చాలు అతడి వెంట కనీసం ఆరుగురు ఆర్మీ సిబ్బంది ఉండాల్సిందే. వారు కూడా రాజాతో పాటుగా పరగులు పెట్టాల్సిందే.
ఈ విషయం గురించి రాజా యజమాని హర్ష ధర్మవిజయ మాట్లాడుతూ...‘ రాజా ప్రతి ఏటా ఉత్సవాల్లో పాల్గొంటాడు. 2015 సెప్టెంబరులో రాజాను ఓ బైకర్ ఢీకొట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అప్పుడు ప్రభుత్వ అధికారులే నా దగ్గరికి వచ్చి రాజాకు రక్షణ కల్పిస్తామని... బాడీగార్డులను నియమిస్తామని చెప్పారు. ఇసాలా ఉత్సవం కోసం రాజా దాదాపు 90 కిలో మీటర్లు నడిచి కొండ మీదకు చేరుకుంటాడు. రోజుకు కనీసం 25 నుంచి 30 కిలోమీటర్లు నడుస్తాడు. ఎల్లప్పుడు బాడీగార్డులు తన వెంటే ఉంటారు’ అని చెప్పుకొచ్చారు. కాగా శ్రీలంకలోని ధనవంతుల్లో చాలా మంది ఏనుగులను పెంచుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే వారిలో కొందరు మాత్రమే వాటిని ప్రేమగా ఆదరిస్తుండగా.. మరికొంత మంది మాత్రం అమానుషంగా ప్రవర్తిస్తూ... ఏనుగులను ఇబ్బంది పెడుతున్నారని జంతుప్రేమికులు విమర్శిస్తున్నారు. ఈ ఏడాది జరిగిన పెరిహెర ఉత్సవాల్లో అనారోగ్యంతో బాధ పడుతున్న 70 ఏళ్ల టికిరీ అనే ఏనుగును కవాతులో నిలపగా.. అక్కడే అది కుప్పకూలిపోయింది. పూర్తిగా చిక్కిశల్యమైన టికిరీ మంగళవారం రాత్రి మరణించడం పలువురిని కలచివేసింది. (చదవండి : కవాతులో కుప్పకూలిన ఆ గజరాజు మృతి)
Comments
Please login to add a commentAdd a comment