
లండన్: ప్రఖ్యాత భౌతిక, అంతరిక్ష శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ పీహెచ్‌డీ థీసిస్ కోసం జనం ఎగబడ్డారు. 1966లో ఆయన సమర్పించిన‘ప్రొపర్టీస్ ఆఫ్ ఎక్స్‌పాండింగ్ యూనివర్సెస్’ థీసిస్‌ను ఆన్‌లైన్‌లో ఉంచగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది దానిని చదివేందుకు ఆసక్తి చూపారు. తమ వద్ద ఉన్న పరిశోధక సమాచారం అంతటిలో ఎక్కువ మంది చదివింది హాకింగ్ థీసిస్‌నే అని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ముద్రణ విభాగం తెలిపింది. ఇంతకుముందెన్నడూ ఇంత మంది ఒకే సమాచారం చూసి ఉన్నట్లు దాఖలాలు లేవన్నారు. కేంబ్రిడ్జి ట్రినిటీ కాలేజీ విద్యార్థిగా స్టీఫెన్ హాకింగ్ తన 24ఏళ్ల వయస్సులో ‘ప్రొపర్టీస్ ఆఫ్ ఎక్స్‌పాండింగ్ యూనివర్సెస్’ అంశంపై 134 పేజీల థీసిస్ రాశారు.
ఇప్పటి వరకు ఈ థీసిస్‌ను కాపీ చేసుకోవాలనుకున్నా, లైబ్రరీకెళ్లి చదువుకోవాలనుకునే వారి నుంచి వర్సిటీ లైబ్రరీ 65 పౌండ్ల వంతున వసూలు చేస్తోంది. 2016 మే నుంచి ఇప్పటి వరకు ఈ థీసిస్ కోసం 199 దరఖాస్తులు అందాయని, దీని తర్వాత అంశాన్ని అత్యధికంగా అందిన దరఖాస్తులు 13మంది మాత్రమేనని వారు వివరించారు. గత సోమవారం దీనిని ఉచితంగా చదువుకునే వీలు కల్పిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో అప్పటి నుంచి వర్సిటీ లైబ్రరీ వెబ్‌సైట్‌లో థీసిస్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారి సంఖ్య అక్షరాలా ఐదు లక్షలు. అదేవిధంగా ఆ వెబ్ సైట్ సందర్శకుల సంఖ్య 20లక్షలకు చేరుకుందని వర్సిటీ ప్రకటించింది. తమ వర్సిటీ నుంచి ఇప్పటి వరకు అత్యంత ప్రజాదరణ పొందిన వైజ్ఞానిక పరిశోధక అంశం ఇదేనని అధికారులు తెలిపారు.
(కాగా స్టీఫెన్ హాకింగ్ (76) బుధవారం కన్నుమూశారు)
Comments
Please login to add a commentAdd a comment