మ్యూనిక్ దాడి ఒక్కడి పనే!
- కాల్పుల తర్వాత ఆత్మహత్య
- జర్మనీ కాల్పుల్లో మృతులు 9
మ్యూనిక్ : జర్మనీలోని మ్యూనిక్ నగరంలో కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య 9కి పెరిగింది. ఒక ఉన్మాది షాపింగ్ మాల్‌లోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోయిన అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తొలుత ముగ్గురు ఉగ్రవాదులు బీభత్సం సృష్టించినట్లు వార్తలొచ్చినప్పటికీ.. ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. అతడిని జర్మనీ-ఇరాన్ సంతతికి చెందిన 18 ఏళ్ల అలీ డేవిడ్ సోన్‌బొలీగా గుర్తించారు. డిప్రెషన్‌కు లోనైన అతడు ఐదేళ్ల క్రితం నార్వేలో ఆండ్రీస్ బెహ్రింగ్ బ్రీవిక్ అనే ఉన్మాది దాడి ఘటన నుంచి ప్రేరణ పొందినట్లు భావిస్తున్నారు.
మ్యూనిక్‌లో ఒలింపియా షాపింగ్ మాల్‌లోని మెక్‌డొనాల్డ్ రెస్టారెంట్‌లో శుక్రవారం కాల్పులు జరగడం తెలిసిందే. నల్లని దుస్తులు ధరించిన ఒక వ్యక్తి తుపాకితో కాల్పులు జరిపిన అనంతరం అక్కడి నుంచి పారిపోయిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో కనిపించింది. పోలీసులు విస్తృత గాలింపు జరిపిన అనంతరం షాపింగ్ మాల్‌కు కిలోమీటర్ దూరంలో నిందితుడి మృతదేహాన్ని గుర్తించారు. ద్వంద్వ పౌరసత్వమున్న అతడికి ఐసిస్ ఉగ్రసంస్థతో ఎలాంటి సంబంధాల్లేవని, నేరచరిత్రా లేదని చెప్పారు.పుస్తకాలు, కథనాల్లోని ఊచకోత ఘటనల నుంచి అతడు ప్రేరణ పొంది ఉంటాడన్నారు. నిందితుడి ఇంట్లో సోదాలు జరిపారు.
మోదీ సంతాపం .. మ్యూనిక్ కాల్పులను ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపారు. ఈఘటనతో ఎంతగానో కలతచెందామని, మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నానన్నారు.