
ఎయిర్‌పోర్టులో ఆత్మాహుతి దాడి
ఢాకా: బంగ్లాదేశ్ రాజధానిలో గుర్తుతెలియని దుండగుడు జరిపిన ఆత్మాహుతి దాడి తీవ్ర కలకలం సృష్టించింది. రాజధాని ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో ఒకరు మృతి చెందారు. ఢాకా అధికారుల కథనం ప్రకారం.. ఓ గుర్తుతెలియని దుండగుడు ఆత్మాహుతి దాడికి సిద్ధమై ఎయిర్‌పోర్టు వద్దకు వచ్చాడు. విమాశాశ్రయంలోని ఓ చెక్ పాయింట్ వద్ద భద్రతా బలగాలు ఓ అనుమానితుడిని గుర్తించాయి.
దాదాపు రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆ దుండగుడు పోలీసుల చెక్ పాయింట్ సమీపంలో ఓ బాంబు అమర్చాడు. ఆ బాంబు పేల్చుకుని ఆ వ్యక్తి చనిపోయాడని రుహుల్ అమిన్ అనే అధికారి వెల్లడించారు. వారం రోజుల్లో ఈ ఎయిర్‌పోర్ట్ లో బాంబు దాడి జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇటీవల ఓ మిలిటెంట్ బైక్‌పై ఎయిర్‌పోర్టు చెక్ పాయింట్ సమీపానికి రాగానే ఆత్మాహుతి దాడికి పాల్పడి చనిపోయాడు. ఢాకాలో కొన్ని ముఖ్య ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.