
ఆత్మహత్య యత్నానికి ముందు.. ఫేస్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత కేట్
ఒక్కోసారి ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అటువంటి నిర్ణయాల వల్ల జీవితాంతం కుమిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అమెరికాకు చెందిన కేట్ స్టబ్‌ఫీల్డ్‌కు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఆమెకు జీవితకాల శిక్ష విధించింది. అయితే అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వైద్య శాస్తంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఆమెకు పునర్జన్మ లభించింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని జీవితమంటే ఎంత విలువైందో నలుగురికీ చాటి చెబుతోన్న కేట్ కథ ఇది..
మార్చి, 2014 కేట్ జీవితాన్ని మలుపు తిప్పిన రోజు. తను ప్రేమించిన వ్యక్తి ఫోన్‌లో వేరే అమ్మాయి ఫొటోలు, మెసేజెస్ చూసిన కేట్.. ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేసింది. అనుకున్నదే తడవుగా ఇంటికి వచ్చి... తన అన్న వద్ద ఉన్న గన్ తీసుకుని ముఖానికి గురిపెట్టుకుంది. ఏదో సరదాకి ఆటపట్టిస్తుందిలే అనుకున్నాడు ఆమె అన్న. కానీ కేట్ మాత్రం నిజంగానే ట్రిగ్గర్ నొక్కింది. బుల్లెట్లు దిగగానే ఆమె ముఖమంతా ఛిద్రమైపోయింది. ఊహించని పరిణామం ఎదురవడంతో కంగుతిన్న ఆమె అన్న వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కేట్ ప్రాణాలైతే కాపాడగలమేమో గానీ, ఆమె పూర్వ రూపం మాత్రం తిరిగి చూడలేరని తేల్చి చెప్పారు వైద్యులు. ఇక అప్పటి నుంచి కేట్ ఆస్పత్రికే పరిమితమైంది. కేట్‌కు ముఖమార్పిడి చేసేందుకు దాతలెవరూ దొరకకపోవడంతో వైద్యులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. దీంతో మూడేళ్ల పాటు నరకయాతన అనుభవించింది కేట్. కానీ ఆండ్రియా రూపంలో కేట్ జీవితంలో మంచి రోజులు వచ్చాయి.
ఫొటో కర్టెసీ : నేషనల్ జియోగ్రఫిక్ మ్యాగజీన్
మూడేళ్ల తర్వాత...
అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకున్న కారణంగా ఆండ్రియా అనే యువతి మృతి చెందింది. అయితే అప్పటికే కేట్‌కు సంబంధించిన వార్తలు, ఫొటోలు మీడియాలో ప్రచారం కావడంతో... తన మనవరాలి పోలికలతో ఉన్న కేట్‌కు పునర్జన్మ ఇవ్వాలనుకుంది ఆండ్రియా వాళ్ల బామ్మ. వెంటనే కేట్ ఉన్న ఆస్పత్రికి వెళ్లి వైద్యులను కలిసింది. ఫార్మాలిటీస్ అన్నీపూర్తయ్యాయి. సుమారు 31 గంటలపాటు జరిగిన సుదీర్ఘ సర్జరీ తర్వాత కేట్‌కు ఓ రూపాన్ని తీసుకురాగలిగారు వైద్యులు. ఆండ్రియా మరణం, ఆమె బామ్మ దాతృత్వం, వైద్యుల కృషితో దాదాపు మూడేళ్ల తర్వాత అంటే మే 4, 2017 నుంచి కేట్ సొంతంగా శ్వాస తీసుకోవడం ఆరంభించింది. తద్వారా ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న అతి చిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది.
ద స్టోరీ ఆఫ్ ఏ ఫేస్ పేరిట..
చిన్న వయస్సులోనే అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొన్న కేట్ జీవితాన్ని, ఆమె కథను ప్రపంచానికి పరిచయం చేయాలని భావించింది నేషనల్ జాగ్రఫిక్ మ్యాగజీన్. ద స్టోరీ ఆఫ్ ఏ ఫేస్ పేరిట కేట్ ఫొటోతో కవర్ పేజీని రూపొందించి స్ఫూర్తిదాయకమైన కథనాన్ని వెలువరించింది. ’ జీవితంలో నాకు రెండో అవకాశం లభించింది. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటే గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నన్ను చూసైనా అటువంటి పిచ్చి పనులు మానుకోండి. జీవితం ఎంతో విలువైంది. ప్రతీ ఒక్కరికి రెండో అవకాశం దొరకదు. అందుకే కాస్త సంయమనంతో వ్యవహరించి జీవితాన్ని అందంగా మలచుకోండి’ అంటూ కేట్ తన అనుభవాల్ని పంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment