నకరికల్లు: అప్పు తీర్చలేదని తాను పండించిన పంటను అప్పు ఇచ్చిన వ్యక్తి తీసుకెళ్లడంతో అవమానభారం తట్టుకోలేక ఓ కౌలు రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు... పల్నాడు జిల్లా నకరికల్లు మండలం పాపిశెట్టిపాలేనికి చెందిన కౌలు రైతు చెన్నంశెట్టి కోటేశ్వరరావు కొన్నేళ్లుగా కౌలుకు తీసుకుని వరి పంట సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా రెండెకరాల్లో సాగు చేశాడు. వరుస నష్టాలతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు భారంగా మారాయి.
ఒక ఎరువుల దుకాణంలో పంటకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, పెట్టుబడి కోసం చేసిన అప్పు రూ.2 లక్షలకు చేరింది. అప్పును తీర్చేందుకుగాను 95 బస్తాలకు పైగా ధాన్యం, మరోవైపు రూ.50 వేల నగదు దశలవారీగా చెల్లించినా ఇంకా బాకీ మిగిలి ఉంది. కాగా, శుక్రవారం వరి పంట నూర్పిడి చేయగా వచ్చిన మొత్తం 80 ధాన్యం బస్తాలను దుకాణదారుడు తన గుమస్తాను పంపి తీసుకెళ్లాడు. దీంతో కోటేశ్వరరావు ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు నరసరావుపేటలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment