
ఫైర్‌ఫైటర్ల కోసం సూపర్ సూట్..
భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది ఎంత శ్రమించినా చివరికి అంతా బూడిదైపోయిన తర్వాతే మంటలు అదుపులోకి వస్తుంటాయి.
భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది ఎంత శ్రమించినా చివరికి అంతా బూడిదైపోయిన తర్వాతే మంటలు అదుపులోకి వస్తుంటాయి. భవనాల వంటివాటిలో ప్రమాదం జరిగితే గనక చాలా మంది సజీవదహనం అయిపోవాల్సిందే. మంటలను ఆర్పేందుకు, బాధితులను కాపాడేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించినా.. అనేక అడ్డంకుల వల్ల వారు అశక్తులుగా మిగులుతుంటారు. అందుకే.. ఎలాంటి ప్రమాదాన్ని అయినా దీటుగా ఎదుర్కొనేలా అగ్నిమాపక సిబ్బందికి ఉపయోగపడే ఈ హైటెక్ ఎక్సోస్కెలిటన్ (బాహ్య అస్థిపంజరం) సూట్‌ను మెల్‌బోర్న్‌కు చెందిన డిజైనర్ కెన్ చెన్ తయారు చేశారు. ఈ ఎక్సోస్కెలిటన్‌ను ధరిస్తే.. ఇక ఎవరైనా సూపర్ హీరోలేనన్నమాట. 23 కిలోల బరువుండే దీనితో 91 కిలోల బరువుని అలవోకగా మోసేయొచ్చు.
రకరకాల పరికరాలు మోసుకుంటూ వేగంగా పరుగెత్తొచ్చు. మెట్లు, భవనాలూ సులభంగా ఎక్కేయొచ్చు. చేతులకున్న వాటర్ క్యానన్‌లను పవర్‌ఫుల్‌గా ప్రయోగించొచ్చు. బాధితులను ఇట్టే భుజాన వేసుకుని తీసుకురావచ్చు. ఇంతా చేసినా.. దీనిని ధరించినవారికి పెద్దగా అలసట అనేదే ఉండదట. ఎందుకంటే.. మొత్తం బరువంతా ఈ ఎక్సోస్కెలిటన్‌పై, ఆ తర్వాత నేలపైనే పడుతుంది మరి. సెన్సర్లు, యాక్చువేటర్లు, బ్యాటరీలతో పనిచేసే ఈ ఎక్సోస్కెలిటన్‌ను వీపు భాగంలో ఉండే ఓ కంప్యూటర్ నియంత్రిస్తుందట. ఆక్సిజన్ సిలిండర్, ఫ్లాష్‌లైట్, ఇతర పరికరాలు కూడా ఈ ఎక్సోస్కెలిటన్‌కు అవసరాన్ని బట్టి అమర్చుకోవచ్చు.