లో బీపీ రోగులకు సర్జరీ ప్రాణాంతకం
లోబీపీతో బాధ పడుతున్న రోగులకు శస్త్రచికిత్స నిర్వహిస్తే అది వారి ప్రాణాలకే ముప్పుగా పరిణమించవచ్చని పరిశోధకులు అంటున్నారు. అధిక రక్తపోటు కూడా ప్రాణానికి హాని కరమే అయినా, దానివల్ల శస్త్రచికిత్స తరువాత ప్రాణానికి పెద్దగా హాని కలగదని నాటింగ్‌హామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శస్త్రచికిత్స చేయడానికి ముందు నుంచి అది పూర్తై కొంతకాలం వరకు రోగుల్లో ఉండే ఇబ్బందుల్ని అనేక అంశాల ఆధారంగా పరిశోధకులు విశ్లేషించారు.
వివిధ శస్త్రచికిత్సలు చేసుకున్న దాదాపు రెండున్నర లక్షల మంది రోగుల్ని పరిశీలించి నివేదిక వెలువరించారు. ఈ నివేదిక ప్రకారం... శస్త్రచికిత్స అనంతరం రోగులపై అధిక రక్తపోటు ప్రభావం పెద్దగా లేదు. అయితే తక్కువ రక్తపోటు ఉన్నవారిలో 40 శాతం మందికి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. మరీ తక్కువ రక్తపోటు ఉన్నవారికి 2.5రెట్లు ఎక్కువగా ప్రాణహాని ఉంది. అందువల్ల శస్త్ర చికిత్సలు చేయించుకున్న రోగులు రక్తపోటును సరైన స్థాయిలో నియంత్రణలో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.