శరత్ కొప్పు
వాషింగ్టన్/హైదరాబాద్: తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శరత్ కొప్పు(25)ను హత్యచేసిన కేసులో పరారీలో ఉన్న నిందితుడ్ని అమెరికా పోలీసులు ఆదివారం కాల్చిచంపారు. అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన పోలీసులపై దుండగుడు కాల్పులు జరపడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఎదురు కాల్పులు జరిపారు. దీంతో నిందితుడు ప్రాణాలు కోల్పోయాడు. వరంగల్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శరత్ మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లారు. అక్కడే మిస్సోరీ రాష్ట్రంలోని కాన్సస్‌లో ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న శరత్‌పై జూలై 6న దొంగతనానికి వచ్చిన ఓ దుండగుడు కాల్పులు జరిపి పరారయ్యాడు. వారంపాటు మాటువేసిన పోలీసులు ఆదివారం నిందితుడ్ని గుర్తించారు.
మఫ్టీలో ఉన్న ఇద్దరు పోలీసులు నిందితుడ్ని ఓ రెస్టారెంట్ వరకూ కారులో వెంబడించారు. చివరకు తనను సమీపిస్తున్న పోలీసుల్ని గుర్తుపట్టిన దుండగుడు వారిపై కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించాడు. దీంతో మఫ్టీలో ఉన్న అధికారులు సైతం ఎదురుకాల్పులు జరిపారు. ఇంతలోనే అదనపు బలగాలు అక్కడకు చేరుకుని ఆపరేషన్‌లో పాల్గొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. శరత్‌ను పొట్టనపెట్టుకున్న దుండగుడ్ని పోలీసులు కాల్చిచంపడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ‘శరత్ హంతకుడ్ని పోలీసులు కాల్చి చంపడం మంచివార్తే. అయితే ఆ దుండగుడ్ని చట్టం ముందు నిలబెట్టి అమాయకుడ్ని చంపినందుకు కుమిలికుమిలి బాధపడేలా శిక్షను విధించాల్సింది’ అని శరత్ బాబాయ్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment