విమానాన్ని ఢీకొట్టిన డ్రోన్
బ్రిటీష్ ఎయిర్ వేస్కు చెందిన విమానాన్ని అనుమానిత డ్రోన్ ఢీకొట్టింది. యూరోప్లోనే చాలా రద్దీగా ఉండే విమానాశ్రయమైన హిత్రూ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు అధికారులు ఆదేశించారు.
137 మంది ప్రయాణికులు, విమానసిబ్బందితో ఎయిర్ బస్ ఏ320 విమానం ల్యాండ్ అవ్వడానికి సిద్దంగా ఉంది. సరిగ్గా అదే సమయంలో డ్రోన్, విమానాన్ని ఢీకొట్టినట్టు గమనించిన పైలెట్ కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. విమానం జెనీవా నుంచి హిత్రూకు వస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.
విమానం సురక్షింతంగా ల్యాండ్ అయిన తర్వాత వెంటనే సిబ్బంది తనిఖీ చేశారు. విమానానికి ఎలాంటి హాని జరగకపోవడంతో మరుసటి ప్రయాణానికి ఎయిర్ బస్ ఏ320 బయలుదేరింది.
అయితే గడచిన మూడు నెలల్లో యూకేలోనే ఇలాంటివి 23 సంఘటనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. విమానాలు, ఢ్రోన్లను ఢీకొంటే కలిగే తీవ్రపరిణామాల గురించి తెలియని వారే ఎదో సరదా కోసం ఇలా చేస్తున్నారని బ్రిటీష్ పైలట్స్ అసోసియేషన్ అధికారి స్టీవ్ లాండెల్స్ తెలిపారు. విమానానికి దగ్గరగా డ్రోన్లను తీసుకురావడం చట్ట పరంగా నేరమని పేర్కొన్నారు.