'ఔను.. మా నాయకుడి మృతి వాస్తవమే'
కాబూల్: తాలిబాన్ ఉగ్రవాద సంస్థ చీఫ్ ముల్లా అక్తర్ మన్సూర్ మృతిపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయి. ఈ మేరకు మన్సూర్ మృతిని ధృవీకరిస్తూ బుధవారం తాలిబాన్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో మన్సూర్ మృతి చెందిన విషయం వాస్తవమే అని అంగీకరించింది. అలాగే కొత్త చీఫ్ను సైతం తాలిబాన్ సంస్థ ప్రకటించింది. ముల్లా హైబతుల్లా అకుంద్ కొత్త చీఫ్గా పగ్గాలు చేపట్టినట్లు తాలిబాన్ సంస్థ వెల్లడించింది.
తాలిబాన్ నేత ముల్లా మహమ్మద్ ఒమర్ 2013లో పాక్‌లో చనిపోయాక 2015, జూలైలో తాలిబాన్ గ్రూపు పగ్గాలను ముల్లాహ్ అక్తర్ మన్సూర్ చేపట్టాడు. అయితే అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో మన్సూర్ మృతి చెందాడని కొన్ని రోజులుగా వార్తలొస్తుంన్న విషయం తెలిసిందే. కాగా, తమ భూభాగంలో అమెరికా వైమానిక దాడులు జరపడం తమ దేశ సార్వ భౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని పాకిస్తాన్ ప్రభుత్వం దీనిపై మండిపడింది.