ట్రంప్‌కు తాలిబాన్ బహిరంగ లేఖ
కాబూల్(తాలిబాన్): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ముస్లిం తీవ్రవాద సంస్థ తాలిబాన్ బహిరంగ లేఖ రాసింది. అఫ్ఘానిస్తాన్‌లో తిష్టవేసిన అమెరికా బలగాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరింది. గత పదహారేళ్లుగా అమెరికా బలగాలు అఫ్ఘానిస్తాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇంగ్లీషులో 1600 పదాలతో సుదీర్ఘంగా రాసిన ఆ లేఖను మంగళవారం తాలిబాన్ నాయకత్వం పత్రికలకు విడుదల చేసింది. గత అమెరికా అధ్యక్షులు అఫ్ఘానిస్తాన్ విషయంలో చేసిన పొరపాట్లను, తీసుకున్న నిర్ణయాలను పునస్సమీక్షిస్తామనటం ద్వారా తప్పిదాలను అంగీకరించినట్లయిందని తాలిబాన్ అధికార ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్ ఆ లేఖలో పేర్కొన్నారు.
అఫ్ఘానిస్తాన్‌లోని బలగాల ఉపసంహరింపు విషయంలో ట్రంప్ ఏకపక్షంగా వ్యవహరించలేనప్పటికీ బలగాల పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవటమో లేక ఉపసంహరించడమో చేయాలని కోరారు. బలగాలను వెనక్కి రప్పించుకోవటం ద్వారా అమెరికా దళాలకు జరిగే హాని నుంచి రక్షించుకోవాలని సూచించారు. ఈ యుద్ధానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు.