కాబూల్ : బక్రీద్ పర్వదినానికి ముందు అఫ్గాన్‌లో అలజడి సృష్టించాలన్న తాలిబన్ల ప్రయత్నానికి ఆ దేశ భద్రతా దళాలు దీటైన జవాబిచ్చాయి. సోమవారం టాఖర్ ప్రావిన్సు నుంచి రాజధాని కాబూల్ వెళ్తున్న 3 బస్సులపై ఖాన్ అబాడ్ జిల్లాలో మెరుపుదాడికి దిగిన తాలిబన్లు సుమారు 170 మంది ప్రయాణికులను నిర్భందించారు. దీంతో రంగంలోకి దిగిన బలగాలు కొద్ది గంటల్లోనే కిడ్నాప్‌కు గురైన వారిలో సుమారు 149 మంది ప్రయాణికులను తాలిబన్ల చెర నుంచి కాపాడాయి. మరో 21 మంది ప్రయాణికులను రక్షించేందుకు బలగాలు ప్రయత్నిస్తున్నాయి.
భద్రతా బలగాల దాడిలో ఇప్పటివరకు ఏడుగురు తాలిబన్లు హతమయ్యారు. బక్రీద్ పండుగకు ఇళ్లకు వెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, భద్రతా సిబ్బందే లక్ష్యంగా తాలిబన్లు ఈ దాడికి తెగబడి ఉండవచ్చని ప్రావిన్స్ కౌన్సిల్ ఉన్నతాధికారి మహ్మద్ యూసఫ్ వెల్లడించారు. ప్రస్తుత ఘటన చోటుచేసుకున్న ప్రాంతం తాలిబన్ల అధీనంలోనే ఉంది. ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ఇటీవల మాట్లాడుతూ.. బక్రీద్ సందర్భంగా కాల్పుల విరమణ పాటించాలని తాలిబన్లను కోరిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించని తాలిబన్లు బక్రీద్‌కు రెండ్రోజుల ముందు ఏకంగా ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment