ఏడాది రెండేళ్ల వయసున్న పిల్లలు కూడా స్మార్ట్‌ఫోన్లతో చెడుగుడు ఆడేస్తున్న కాలమిది. వాళ్లంతా తెలివిమీరిన పిల్లలని, మనకు ఇప్పటికీ అవి కష్టమేనని అంటుండటమూ చూస్తుంటాం. కానీ నూతన ఆవిష్కరణలతో టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిన ‘టెక్ గురు’లు మాత్రం తమ పిల్లలను టెక్నాలజీకి దూరంగా ఉంచడం గమనార్హం.
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్, యాపిల్ సంస్థతో కొత్త పోకడలకు శ్రీకారం చుట్టిన స్టీవ్స్‌జాబ్స్‌లు తమ పిల్లల విషయంలో తీసుకున్న జాగ్రత్తలు చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే! చిన్న వయసులోనే సాంకేతికత అతి వినియోగం వల్ల పిల్లల్లో తలెత్తే సమస్యలు, వారిపై చూపే ప్రభావాన్ని గుర్తించడమే దీనికి కారణం.
14 ఏళ్లదాకా ఫోన్ ముట్టనివ్వలేదు..
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ తమ పిల్లలకు 14 ఏళ్ల వయసు వచ్చే వరకూ ఏ టెక్నాలజీ కూడా వారి దగ్గరకు చేరకుండా ఆంక్షలు పెట్టారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయం వెల్లడించారు. గాడ్జెట్ల అతి వినియోగం వల్ల నిద్ర దూరమవుతుందని.. అరకొర నిద్రతో ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.
పిల్లలు కొంచెం పెద్దయ్యాక మాత్రం పరిమిత సమయం పాటు గాడ్జెట్లను ఉపయోగించేలా అవకాశమిచ్చారట. మిగతా సమయాన్ని పిల్లలు తమ మిత్రులు, బంధువులను కలిసేందుకు, హోంవర్క్ చేసేందుకు ఉపయోగించుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారట. ఇదంతా 2007లో ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్నపుడే జరిగింది. పిల్లలకు 14 ఏళ్లు వచ్చే వరకు సెల్‌ఫోన్లు కూడా ఇవ్వలేదు.
స్టీవ్‌జాబ్స్...
ఐఫోన్లు, ఐపాడ్స్ వంటి నూతన ఆవిష్కరణలతో ప్రపంచం దృష్టిని ఆవిష్కరించిన యాపిల్ మాజీ సీఈవో, దివంగత స్టీవ్‌జాబ్స్ తమ పిల్లలను అసలు ఐపాడ్స్‌ను ఉపయోగించనివ్వలేదట. 2010లో కొత్తగా రూపొందించిన ఐపాడ్‌ను మీపిల్లలు ఇష్టపడ్డారా? అని ఓ విలేకరి స్టీవ్‌ను అడిగితే.. ‘వాళ్లు ఐపాడ్‌ను అస్సలు ఉపయోగించలేదు. ఇంటివద్ద పిల్లలు ఏ మేరకు టెక్నాలజీ ఉపయోగించాలనే దానిపై నియంత్రణ విధించాం..’’ అని సమాధానం ఇచ్చారు.
తమ ఇంట్లో ఐపాడ్‌ల వినియోగాన్నే నిషేధించుకున్నామని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఐపాడ్ డిజైన్‌లో పాలుపంచుకున్న జోనాథాన్ కూడా తమ పిల్లలకు ఐప్యాడ్ల వినియోగంపై నిబంధనలు విధించినట్టు చెప్పడం గమనార్హం. ఇక తన 12 ఏళ్ల మేనల్లుడు సోషల్ మీడియాను ఉపయోగించడం ఇష్టం లేదని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా చెప్పారు. వీరేకాదు.. చాలామంది ‘టెక్ గురు’లు కూడా ఇదే తరహాలో వ్యవహరించడం గమనార్హం.
‘టెక్ గురు’లు ఇళ్లల్లో విధించిన ఆంక్షల్లో కొన్ని..
♦ పిల్లలకు 14 ఏళ్లు వచ్చే వరకు స్మార్ట్ ఫోన్లు, ఐప్యాడ్ల వంటివి ఇచ్చేందుకు నో.
♦ ముఖ్యంగా భోజన సమయాల్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించరాదు
♦ వారంలో గాడ్జెట్స్‌ను ఎన్ని గంటలు ఉపయోగించాలనే పరిమితి. (మరీ చిన్నపిల్లలైతే పూర్తిగా నిషేధం)
♦ రాత్రి నిద్రపోవడానికి ముందే అన్ని పరికరాలు ఆఫ్ చేసేయాలి
♦ బెడ్‌రూంలలోకి ఎలక్ట్రానిక్ పరికరాలు నిషిద్ధం
♦ పిల్లలు ఉపయోగించే సామాజిక మాధ్యమాలపై నియంత్రణ
Comments
Please login to add a commentAdd a comment