చిలకలా ఉండేందుకు చెవులు కోసుకున్నాడు...
లండన్: బ్రిటన్‌లోని బ్రిస్టల్ నగరానికి చెందిన టెడ్ రిచర్డ్స్ అనే 56 ఏళ్ల ప్రబుద్ధిడికి రామ చిలకలంటే ప్రాణమే కాదు, వల్లమాలిన పిచ్చి. ఆ పిచ్చికాస్త ఈ మధ్య మరీ ప్రకోపించింది. దాంతో తాను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న రామ చిలకల్లాగా తన ముఖం కూడా ఉండాలని భావించాడు. అంతే...తన రెండు చెవులను సర్జరీతో తీసేయించుకున్నాడు. రామ చిలక రంగులను తలపించేలా ముఖానికి దాదాపు 150 రంగు రంగుల టాట్టులను వేయించుకున్నాడు. అంతటితో సంతృప్తి పడలేదు. జుట్టును కత్తిరించుకొని తల ముందుభాగాన ముచ్చటగా మూడు చిన్నపాటి కొమ్ములను తగిలించుకున్నాడు.
ముక్కు కొసన ఓ రింగ్, బుగ్గలపై మెరిసే మెటల్ వస్తువులను తగిలించుకునేందుకు ఏకంగా 150 రంధ్రాలు చేయించుకున్నాడు. నాలుక కొసను రెండుగా చీల్చుకున్నాడు. చిలుకను పోలిన ముక్కును సాధించేందుకు ముక్కు సర్జరీ కోసం ముస్తాబవుతున్నాడు. తనకిష్టమైన ఎల్లి, టీకా, తిమ్నేహ్, జేక్, బూబీ అంటూ ముద్దుగా పిలుచుకునే రామ చిలకలతో ఆడుకుంటూ మురసిపోతున్నాడు.
‘ఇప్పుడు నిజంగా నేను గొప్పగా కనిపిస్తున్నాను. ఇది నాకెంతో ఆనందంగా ఉంది. నా సంతోషానికి అవధులు లేవు. అద్దంలో చూసుకోకుండా ఒక్క క్షణం ఉండలేక పోతున్నానంటే ఒట్టు. ముద్దొచ్చే నా చిలకల్లా సాధ్యమైనంత వరకు ఉండాలన్నదే నా తాపత్రయం’ అని తన వింత చేష్ట గురించి గొప్పగా చెప్పుకున్నాడు. ఓ చెప్పుల కంపెనీలో పనిచేసి రిటైరయిన రిచర్డ్స్‌కు బాడీ పెయింటింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. దానికి ఇప్పుడు వెర్రి వేషాలు తోడయ్యాయి. తన ఎడమ భుజం మీద శాంతి చిహ్నం చెక్కించేందుకు 750 సెంటిగ్రేడ్ డిగ్రీల వద్ద వేడిచేసిన ఇనుప కడ్డీలను ఉపయోగించాడు.
ఇప్పుడు తాను బయటకు ఎక్కడికెళ్లినా తనవైపు పిన్నా, పెద్దలందరూ వింతగా చూస్తున్నారని, అది తనకెంతో థ్రిల్లింగా ఉందని రిచర్డ్స్ తెలిపాడు. తాను ముదటి నుంచి ఇతరులకన్నా భిన్నంగా ఉండాలని, తనలా ఎవరూ ఉండకూడదని భావించే వాడినని ఇప్పుడు తనకా కోరిక తీరిందని చెప్పాడు. అంతా బాగానే ఉన్నప్పటికీ చిన్న ఇబ్బంది మాత్రం తప్పడం లేదని వాపోయాడు. చెవులులేక పోవడం వల్ల కళ్లజోడు పెట్టుకోవడం కష్టమవుతోందని అన్నాడు.