
ఆమె ఒక్కసారిగా 60 అడుగుల పై నుంచి నీటిలో పడిపోయారు
వాషింగ్టన్ : విహార యాత్రలో స్నేహితురాలు చేసిన పని ఓ యువతిని ఆస్పత్రి పాలు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. 16 ఏళ్ల యువతి మంగళవారం స్నేహితులతో కలిసి వాషింగ్టన్ యాక్టోల్‌లోని మౌల్టన్ జలపాతాన్ని సందర్శించడానికి వెళ్లారు. జలపాతం పైనున్న బ్రిడ్జి అంచున నిలుచున్న ఆమె జలపాతం అందాలను చూస్తుండగా.. వెనకాల నిల్చున్న స్నేహితురాలు ఒక్కరు ఆ యువతిని బలంగా తోసివేశారు. దీంతో ఆమె ఒక్కసారిగా 60 అడుగుల పై నుంచి నీటిలో పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా ప్రస్తుతం మారింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు 5 ప్రక్కటెముకలు విరగడంతోపాటు, ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఆమె తల్లి మాట్లాడుతూ.. ‘నా కూతురు కొలుకోవడానికి చాలా సమయం పడుతోంది. ఈ చర్యకు పాల్పడ్డ అమ్మాయి తను చేసింది ఎంత పెద్ద తప్పో తెలుసుకోవాలి. ఆ అమ్మాయి నా కూతురిని చంపాలని చూసింద’ని తెలిపారు. గతంలో కూడా ఈ జలపాతంలో దూకి ఓ వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో సిబ్బంది అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. జలపాతంలో దూకడం ప్రమాదకరమని.. కింద రాళ్లతో పాటు, లోతు కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.