
యువత చెవిటిదైపోతోంది!
సంగీతం హోరులో యువత చెవిటిదైపోతోంది. నిశ్శబ్దం, మెలొడీలోని ప్రశాంతతను గుర్తించలేక.. వేలం వెర్రిగా భారీ శబ్దాల వెంట పరిగెడుతూ చెవిటిదైపోతోంది. క్లబ్బుల్లో హోరెత్తే సంగీతంతో పాటు.. చెవిలోపలికి దూరి మరీ భారీ శబ్దాలను వినిపించే హెడ్ ఫోన్స్ కారణంగా 40 ఏళ్లు వచ్చే లోపే హియర్ మెషిన్లను చెవులకు తగిలించుకునే పరిస్థితి వస్తోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ సావోపాలో మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన పరిశోధనలో విస్తుగొలిపే విషయాలు వెల్లడయ్యాయి. 11 ఏళ్ల నుంచి 17 ఏళ్ల మధ్య వయస్కులపై జరిపిన ఈ పరిశోధనలో.. అధిక శబ్దాలను ఆస్వాదించే వారిలో ఎక్కువ శాతం మంది టిన్నిటస్( చెవికి సంబంధించిన రుగ్మత)తో బాధపడుతున్నట్లు వెల్లడైంది. చెవిలోని కాక్లియర్ హెయిర్ సెల్స్ దెబ్బతినడం మూలంగా టిన్నిటస్ వస్తోంది. క్లబ్బుల్లో హోరెత్తే మ్యూజిక్, హెడ్ఫోన్స్ కాక్లియర్ హెయిర్ సెల్స్ దెబ్బతినేలా చేస్తాయని పరిశోధకులు వెల్లడించారు. పిల్లలు టీనేజ్ నుంచే భారీ శబ్దాలకు అలవాటు పడటం మూలంగా వారు 35 నుంచి 40 ఏళ్లకు వచ్చేసరికి తీవ్రమైన వినికిడి సమస్యలు ఎదుర్కొంటారని వెల్లడించారు. మరో విషాదం ఏమిటంటే.. యువత అసలు ఈ సమస్యను గుర్తించి డాక్టర్లను సంప్రదించడం లేదు. సాధారణంగా అరవై ఏళ్లకు పైబడిన వారిలో కనిపించే వినికిడి సమస్యలను యువత కోరి మరీ ముందే తెచ్చుకుంటుందన్నమాట.