
'అమెరికా మా డబ్బు దొంగిలించాలనుకుంటుంది'
టెహ్రాన్: అమెరికా తీరుపై ఇరాన్ మండిపడింది. ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. ఇరాన్ దాడుల్లో గాయపడిన అమెరికన్ కుటుంబాలకు భారీ మొత్తంలో ఆ దేశ ప్రభుత్వం చెల్లింపులు జరపాలని అమెరికా కోర్టు చెప్పిన తీర్పును ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది ముమ్మాటికి 'దొంగతనం'లాంటి తీర్పు అని వ్యాఖ్యానించింది. 1983లో అమెరికా గస్తీ దళం బీరుట్ లో జరిగిన బాంబు దాడుల్లో గాయపడింది. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు.
ఈ దాడికి ఇరాన్ కారణమని అమెరికా ఆరోపించింది. ఆ ఆరోపణల ప్రకారమే పలు దఫాలుగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు దాదాపు రెండు బిలియన్ల ఆస్తులను అమెరికా కుటుంబాలకు నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. దీంతో ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ జబేరి అన్సారీ ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికా సుప్రీంకోర్టు తీర్పును తప్పుబడుతూ ఆ తీర్పు 'ఇరాన్ సొమ్మును దొంగలించడమే' అని అభివర్ణించారు.