వాషింగ్టన్: అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెల్లజాతి పోలీసు కాళ్ల కింద నలిగిపోయి, ఊపిరాడక తుదిశ్వాస విడిచిన జార్జ్ ఫ్లాయిడ్‌కు సంబంధించి ఓ ఆడియో టేప్ బుధవారం రిలీజైంది. దీని ప్రకారం.. అతను ప్రాణాలు విడిచే కొద్ది క్షణాల ముందు తనన చంపవద్దంటూ అధికారులను పదేపదే వేడుకున్నాడు. మరోవైపు అతను పోలీసులను చూసి వణికిపోతూనే వారికి సహకరించాడు. కారు నుంచి కింద పడేసే క్రమంలో అతని నోటి నుంచి రక్తం వచ్చినట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ అవేమీ పట్టించుకోని పోలీస్ ఆఫీసర్ డెరెక్ చావిన్ అతని మెడపై మోకాలితో గట్టిగా అదుముతూ క్రూరత్వం ప్రదర్శించాడు. దీంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారిన అతను తనకు కరోనా ఉందని, చచ్చిపోతానేమోనని భయంగా ఉందన్నాడు. "నువ్వు మాట్లాడగలుగుతున్నావ్.. కాబట్టి బాగానే ఉన్నావ్‌లే" అంటూ సదరు పోలీసు కాఠిన్యంగా మాట్లాడాడు. (జాతి వివక్ష అంతమే లక్ష్యం)
'ఆక్సిజన్ ఎక్కువగా తీసుకుంటున్నందున ఈ మాత్రమైనా మాట్లాడుతున్నా'నని సమాధానమిస్తూనే సాయం చేయమని అర్థించాడు. అప్పటికీ ఆ పోలీసు వెనక్కు తగ్గకపోవడంతో "వీళ్లు నన్ను చంపబోతున్నారు, నన్ను చంపేస్తారు" అంటూ ఆర్తనాదాలు చేశాడు. "మామా.. ఐ లవ్ యూ... నా పిల్లలకు చెప్పు వాళ్లంటే నాకు ఎంతో ప్రేమ" అని చెప్పాడు. అనంతరం కొన్ని క్షణాల్లోనే అతని ప్రాణం గాల్లో కలిసిపోయింది. జార్జ్ ఫ్లాయిడ్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు మిన్నియా పోలీసులు అలెగ్జాండర్ కుంగ్, థామస్ లేన్ దగ్గర లభ్యమైన కెమెరాల ద్వారా ఈ ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది.ఈ కేసులో వీరితోపాటు చావిన్, టై థావో నిందితులుగా ఉన్నారు. మే 25న పోలీస్ అధికారి ఫ్లాయిడ్ మెడపై సుమారు ఎనిమిది నిమిషాల 46 సెకన్లపాటు మోకాలిని నొక్కిపెట్టి ఉంచడంతో అతడు మరణించిన విషయం తెలిసిందే. (జార్జ్ ఫ్లాయిడ్‌కు ఘన నివాళి )
Comments
Please login to add a commentAdd a comment