1962లో అక్కడ..ఇప్పుడు సిక్కింలో!
సరిహద్దులో చైనా దుశ్చర్యలు
సాక్షి నాలెడ్జ్ సెంటర్ : భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరు దేశాల మధ్య యుద్ధమే వస్తే భారత్ 1962నాటి పోరులోకంటే ఎక్కువగా నష్టపోతుందని చైనా హెచ్చరిస్తోంది. భారత్, భూటాన్, చైనా సరిహద్దులకు ఆనుకుని ఉన్న డోకా లా పీఠభూమిలోకి చైనా తన సరిహద్దు రహదారి విస్తరణకు చేస్తున్న ప్రయత్నాలను భారత సేనలు అడ్డుకోవడం తాజా ఉద్రిక్తతలకు దారిదాసింది. జమ్మూ–కశ్మీర్ నుంచి ప్రారంభమయ్యే భారత– చైనా సరిహద్దు మధ్యలో నేపాల్, భూటాన్‌ను వదిలేసి సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌తో ముగుస్తుంది. మొత్తం సరిహద్దు పొడవు 3,488 కిలోమీటర్లు. సిక్కిం సెక్టార్లో ఈ సరిహద్దు 220 కిలోమీటర్లు. 1962లో భారత్, చైనాల మధ్య వివాదాస్పద ప్రాంతాలు అక్సాయ్‌చిన్ (కశ్మీర్), అరుణాచల్ ప్రదేశ్(మెక్ మోహన్ రేఖ వెంట) కావడంతో యుద్ధం ఆ రెండు చోట్లా జరిగింది. ఆ ఏడాది అక్టోబర్ 20న ఈ రెండు ప్రాంతాల్లో మొదలైన యుద్ధం నవంబర్ 21 వరకు కొనసాగింది. భారత్ ఓటమితో అక్సాయ్‌చిన్ చైనా వశమైంది.
ప్రస్తుత వివాదం భూటాన్, చైనా మధ్యే!
భూటాన్‌ను ఆనుకుని డోకా లా పీఠభూమిలో చైనా రోడ్డు నిర్మాణం పూర్తయితే భారత్‌కు సమస్యలు ఎదురవుతాయి. భారత ప్రధాన భూభాగాన్ని 8 ఈశాన్య రాష్ట్రాలతో కలిపే ‘సిలిగుడి కారిడర్’(చికెన్‌నెక్) భవిష్యత్తులో చైనా దాడులకు లక్ష్యంగా మారే ప్రమాదముంది. వాస్తవానికి డోకా లా.. చైనా–భూటాన్‌ల వివాదం. భూటాన్‌తో భారత్‌కు ఉన్న సత్సంబంధాలు, దాని రక్షణ బాధ్యత దృష్ట్యా భారత సైనికులు భూటాన్ సైన్యానికి మద్దతుగా నిలవడం చైనాకు రుచించలేదు. డోకా లా వివాదంపై భూటాన్, చైనాల మధ్య 16సార్లు చర్చలు జరిగిన ఫలితం లేకపోయింది.
భారత్ నుంచి సైనిక సాయం తీసుకోవడం ద్వారా ఈ చిన్న హిమాలయ రాజ్యం తమ సార్వభౌమాధికారాన్ని ఉల్లఘించిందని చైనా ఆరోపించింది. నేపాల్‌ను గతంలో తనవైపు తిప్పుకున్నట్టే ఇప్పుడు భూటాన్‌నూ నయానో భయానో దారిలోకి తెచ్చుకోవడానికి చైనా వ్యూహం పన్నినట్టు కనిపిస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్ తనదని వాదిస్తున్నట్టే డోకా లా కూడా తనదేనని చెబుతోంది. డోకా లా ఉద్రిక్తత సైనికపరంగా పెద్దవైన భారత్, చైనాల మధ్య నిజంగానే యుద్ధానికి దారితీస్తే అది సిక్కిం సెక్టార్‌లోని 220 కి.మీ. సరిహద్దుకే పరిమితమౌతుందా, లేకపోతే ఇతర సెక్టార్లకూ విస్తరిస్తుందా అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేం.