ప్రతీకాత్మక చిత్రం
లండన్ : ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్తాన్ ప్రథమ స్థానంలో ఉందని తాజా నివేదిక వెల్లడించింది. ఉగ్రవాదులను పెంచి పోషించే పాక్ కారణంగా అంతర్జాతీయ భద్రతకు పెను ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ‘హ్యుమానిటి ఎట్ రిస్క్- గ్లోబల్ టెర్రర్ థ్రెట్ ఇండిసెంట్’ పేరిట ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీ, స్ట్రాటజిక్ ఫోర్‌సైట్ గ్రూప్(ఎస్‌ఫీజీ) ఆర్టికల్‌ను పబ్లిష్ చేశాయి. ‘ప్రపంచ భద్రతకు అత్యంత ప్రమాదకరంగా పరిణమించిన ఆఫ్గాన్ తాలిబన్, లష్కర్ ఎ తోయిబా, ఆల్‌ఖైదాకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించడంలో మిగతా అన్ని దేశాలతో పోలిస్తే ముందువరుసలో ఉంది. అంతేకాదు తమ వద్ద ఉన్న ఆయుధాలను దుర్వినియోగం చేయడం ద్వారా మానవాళిని ప్రమాదంలో పడేసేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. 2030 నాటికి ఈ ఉగ్ర సంస్థల కారణంగా ప్రపంచ పౌరుల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని’ పేర్కొంది.
ప్రపంచంలోని వివిధ దేశాల్లో 21వ శతాబ్దంలోని మొదటి దశాబ్దంలో జరిగిన ఉగ్రదాడుల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. సుమారు 200 ఉగ్ర సంస్థల కార్యకలాపాలను విశ్లేషించిన అనంతరం ఈ నివేదికను వెల్లడించినట్లు ఎస్‌ఫీజీ పేర్కొంది. గత ఐదు సంవత్సరాల కాలంలో లిబియా, సిరియా, యెమన్‌లలో అంతర్యుద్ధం ద్వారా ఐసిస్ మీడియా ప్రచారాన్ని బాగా పొందింది కానీ ఆల్‌ఖైదా చాప కింద నీరులా తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉందని నివేదిక వెల్లడించింది. సిరియా కంటే కూడా పాక్‌లో పౌరుల భద్రతకు మూడు రెట్లు ఎక్కువ ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ఆల్‌ఖైదా పుట్టకకు కారణమైన పాకిస్తాన్ ఆఫ్గనిస్తాన్‌లో అస్థిరతను సృష్టిస్తోందని నివేదించింది. అంతేకాదు ఉగ్ర సంస్థల నుంచి రిటైర్ అయిన కొంత మంది మాజీ ఉగ్రవాదులు.. సాధారణ పౌరుల ముసుగులో తమ కార్యకలాపాలను యథేచ్చగా కొనసాగిస్తున్నారని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment