
బాగ్దాద్‌లో నరమేధం
షాపింగ్ సెంటర్ వద్ద ఆత్మాహుతి దాడి.. 119 మంది మృతి.. 140 మందికిపైగా గాయాలు
- రంజాన్ షాపింగ్‌లో ఘాతుకం
- దాడి తామే చేశామన్న ఐసిస్
బాగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరంలో ఐసిస్ ఉగ్రవాదులు మళ్లీ దారుణ మారణకాండకు తెగబడ్డారు. ఆదివారం జనసమ్మర్దమున్న వాణిజ్య ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి పాల్పడి 119 మంది అమాయక ప్రజలను బలితీసుకున్నారు. ఈ దాడిలో మరో 140 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో పలువురు చిన్నారులు, మహిళలు ఉన్నారు. అమెరికా, ఇరాక్ బలగాలతో పోరులో ఐసిస్ వరుస ఓటములతో భారీగా నష్టపోతున్నా.. ఇలాంటి దాడులకు పాల్పడే శక్తిసామర్థ్యాలు దానికి ఇంకా ఉన్నాయని తాజా నరమేధం హెచ్చరిస్తోంది.
జన ం మధ్య ఆత్మాహుతి దాడి..
నగరంలోని కారాదా జిల్లాలో జనంతో కిటకిటలాడుతున్న షాపింగ్ సెంటర్ వెలుపల పేలుడు పదార్థాలున్న కారులో వచ్చిన ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ వారంలో రానున్న రంజాన్ పర్వదినం కోసం శనివారం అర్ధరాత్రి దాటాక ఉపవాసాలు ముగించుకుని షాపింగ్ కోసం వచ్చిన ప్రజలను బాంబర్ లక్ష్యంగా చేసుకున్నాడు. మృతుల్లో ఎక్కువ మంది బహుళ అంతస్తుల షాపింగ్, వినోదాల మాల్‌లో బలైన వారేనని పోలీసులు చెప్పారు. వీరిలో కొందరు మంటల్లో కాలిపోయి, కొందరు పొగతో ఊపిరాడక చనిపోయారని వెల్లడించారు. షాపింగ్ సెంటర్, చుట్టుపక్కల దుకాణాల్లో మంటలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. వాహనాలు గుర్తుపట్టలేనంతగా దెబ్బతిన్నాయి. మంటలు, పొగ, శిథిలాలు, మృతదేహాలు, బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భీతావహంగా కనిపించింది. ఆదివారం పొద్దుపోయాక కూడా అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతూ కనిపించారు.
షియాల లక్ష్యంగా దాడి: ఐసిస్
పేలుడు తర్వాత... ఇది తమ పనేనని ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్) ఒక మిలిటెంట్ల వెబ్‌సైట్‌లో ప్రకటించింది. తమ భద్రతా ఆపరేషన్లలో భాగంగా షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఒక ఇరాకీ ఈ దాడి చేశాడంది. కాగా, కరాదా పేలుడు జరిగిన కాసేపటికి నగర ఉత్తర ప్రాంతమైన షాబ్‌లో శక్తిమంతమైన బాంబు పేలింది. ఒకరు మరణించగా నలుగురు గాయపడ్డారు. అయితే మృతుల సంఖ్యపై స్పష్టత లేదు. ఈ దాడి కి సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ నుంచీ ప్రకటన వెలువడలేదు. బాగ్దాద్‌కు 50 కి.మీ దూరంలో ఉన్న ఫలూజా నగరాన్ని ఇరాక్ ప్రభుత్వ బలగాలు వారం కిందట ఐసిస్ నుంచి తిరిగి చేజిక్కించుకున్న నేపథ్యంలో కరాదా దాడి జరిగింది. ఇరాక్‌లో ఈ ఏడాదిలో ఉగ్రవాదులు భారీ మారణహోమానికి పాల్పడడం ఇది రెండోసారి. మే నెల 11న బాగ్దాద్‌లో ఐసిస్ మూడు చోట్ల జరిపిన కారు బాంబు దాడుల్లో 93 మంది మృతిచెందారు. ప్రస్తుతం ఇరాక్‌లో మోసుల్ నగరం ఒక్కటే ఐసిస్ అధీనంలో ఉంది.
ఘటనా స్థలానికి ప్రధాని..
కరాదా షాపింగ్ ప్రాంతాన్ని ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాదీ, ఇతర ప్రజాప్రతినిధులు సందర్శించారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించి తీరతామన్నారు. అక్కడ గుమికూడిన జనం ‘అబాదీ దొంగ‘ అంటూ నినాదాలు చేశారు.
భూకంపం అనుకున్నా..
‘మొదట భూకంపం వచ్చిందేమో అనుకున్నా. నా సరుకులను మూటగట్టుకుని ఇంటికి వెళ్తుండగా భారీ శబ్దంతో మంటలు కనిపించాయి. వెనక్కి వెళ్దామంటే భయమేసింది. నా స్నేహితులకు ఫోన్ చేశాను. కానీ ఎవరి నుంచీ జవాబు రాలేదు. వారిలో ఒకతను చనిపోగా, మరొకతను గాయపడ్డాడు. ఒకరు గల్లంతయ్యాడు’ అని కరాదా పేలుడు సాక్షి, వ్యాపారి కరీం సమీ చెప్పాడు. తన కుటుంబం నడుపుతున్న షాపులో ఆరుగురు ఉద్యోగులు చనిపోయారని హుసేన్ అలీ అనే సైనికుడు చెప్పాడు. ‘నేను మళ్లీ యుద్ధానికి వెళ్తాను. అక్కడైనా శత్రువు ఎవరో తెలుసుకుని పోరాడతాను. ఇక్కడ ఎవరితో పోరాడాలో అర్థం కావడం లేదు’ అని పేర్కొన్నాడు.
సోనియా సంతాపం
బాగ్దాద్ బాంబు పేలుళ్లను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తీవ్రంగా ఖండించి, బాధితులకు సంతాపం తెలిపారు. గత వారం మానవతకు భయోత్పాతంగా గడిచిందని ఈ దాడులను, బంగ్లా రాజధాని ఢాకాలో ఓ హోటల్‌పై ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ పేర్కొన్నారు.