అమెరికాలోనూ భారీగా..
అందరూ ఇళ్ల నుంచి చాపలు తెచ్చుకున్నారు. చకచకా వాటిని క్రమపద్ధతిలో పరిచేసుకున్నారు. వాటిమీద పడుకుని రకరకాల భంగిమలలో యోగాసనాలు వేయడం మొదలుపెట్టారు. ఇదంతా ఢిల్లీలోనో, ముంబైలోనో అనుకుంటున్నారా.. అమెరికాలో. మంగళవారం అంతర్జాతయ యోగా దినోత్సవం సందర్భంగా ఇప్పటినుంచే అమెరికాలో ప్రాక్టీసు మొదలుపెడుతున్నారు. హ్యూస్టన్‌లోని పలు పాఠశాలలు, పతంజలి యోగపీఠం, ప్రళయ యోగా స్టూడియోల సహకారంతో భారతీయ కాన్సులేట్ జనరల్ ఈ కార్యక్రమాన్ని డిస్కవరీ గ్రీన్ ప్రాంతంలో నిర్వహిస్తోంది.
హ్యూస్టన్‌లో భిన్నవర్గాలకు చెందిన వారిని పెద్ద సంఖ్యలో ఇక్కడకు తీసుకొస్తున్నామని, అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని మంచి పద్ధతిలో చేస్తున్నామని భారత కాన్సల్ జనరల్ అనుపమ్ రే తెలిపారు. హ్యూస్టన్ వాసులంతా పెద్దసంఖ్యలో తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, యోగాతో శాంతి సామరస్యాల సందేశాన్ని అందరికీ పంచాలని ఆయన కోరారు. టెక్సాస్ రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.