కాల్ సెంటర్ స్కామ్: మాస్టర్ మైండ్ జాడ తెలిసింది!
దుబాయి: మహారాష్ట్రలోని థానెలో ఉండి అమెరికాలో పన్ను ఎగ్గొట్టేవాళ్ల నుంచి దాదాపు రూ.500 కోట్లు నొక్కేసిన సాగర్ ఠక్కర్ అలియాస్ షాగీ వివరాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. అతడు ప్రస్తుతం దుబాయిలో ఉన్నట్లు థానె అధికారులు వెల్లడించారు. కాల్ సెంటర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు సాగర్ ఠక్కర్. గతేడాది తన గర్ల్‌ఫ్రెండుకు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఆడి కారును బర్త్‌డే గిఫ్టుగా ఇచ్చిన విషయాన్ని గతంలోనే తెలిపారు. దుబాయి పోలీసులు ఠక్కర్‌ను గుర్తించి అడ్డుకున్నారని థానే పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ వెల్లడినా.. పూర్తి వివరాలు చెప్పేందుకు నిరాకరించారు.
గత నెలలో సాగర్ ఠక్కర్ యూఏఈకి వెళ్లే ప్రయత్నంలో ఉండగా దుబాయి విమానాశ్రయంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పుణే పోలీసులకు స్థానిక సిబ్బంది సమాచారం అందించారు. అయితే అతడిపై రెడ్ కార్నర్ నోటీసు (ఆర్‌సీఎన్) వ్యవహారం తేలిన తర్వాతే విదేశాలకు అనుమతిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. దుబాయి అధికారులు వారి ప్రాథమిక విచారణ పూర్తయిన తర్వాత తమ కస్డడీకి ఠక్కర్‌ను అప్పగించాలని కోరనున్నట్లు ఓ సీనియర్ అధికారి చెప్పారు. కాల్ సెంటర్ స్కామ్‌కు సంబంధించి గత అక్టోబర్‌లో 9 బోగస్ కాల్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు దాదాపు 70 మంది ఉద్యోగులను అరెస్ట్ చేశారు.
అమెరికాలో పన్ను ఎగ్గేట్టే వారికి ఈ కాల్ సెంటర్ ముఠా కాల్స్ చేసి తాము ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్), డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రెజరీ అండ్ అధికారులుగా చెప్పి బెదిరింపులకు పాల్పడి వందల కోట్లు వసూలుచేయడం అప్పట్లో కలకలం రేపింది. థానే క్రైమ్ బ్రాంచ్ ఈ కేసుకు సంబంధించి 5000 పేజీల చార్జిషీటు ఫైల్ చేయగా, అందులో 700 మంది నిందితుల పేర్లను అందులో పేర్కొంది. ఇందుకు అనుబంధ చార్జిషీటును ఫిబ్రవరిలో చేసి అధికారులు కొంతమేర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.