అప్పటివరకూ గట్టిగా కొట్టుకున్న పికిన్ గుండె ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది.. అప్పోను గట్టిగా పట్టుకుంది.కొన్ని నిమిషాల క్రితం వరకూ అప్పో ఎవరో పికిన్‌కు తెలియదు..కానీ ఇప్పుడీ ప్రపంచంలో అందరికంటే ఎంతో ఆప్తుడిలా కనిపిస్తున్నాడు..అప్పో దగ్గరుంటే..అమ్మ దగ్గరున్నట్లుంది..ఎలాంటి భయం లేకుండా.. భద్రంగా..అచ్చం అమ్మ కడుపులో ఉన్నట్లు..అమ్మ జన్మనిస్తే.. అప్పో పునర్జన్మనిచ్చాడు.. థాంక్ యు అప్పో..
పికిన్–అప్పోల ఈ చిత్రం వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2017లో ప్రతిష్టాత్మక పీపుల్స్ చాయిస్ పురస్కారాన్ని గెలుచుకుంది. 50 వేల ఎంట్రీలు రాగా.. కెనడాకు చెందిన ఫొటోగ్రాఫర్ జొఆన్ తీసిన ఈ చిత్రం మొదటి స్థానాన్ని గెలుచుకుంది. ‘ఇద్దరు స్నేహితుల అపురూపమైన చిత్రమిది. పికిన్ ఓ గొరిల్లా.. అప్పోలినేర్ ఏప్ ఆఫ్రికా తరఫున పనిచేస్తుంటాడు. పికిన్‌ను కొందరు వేటగాళ్లు పట్టుకున్నారు. మాంసం కోసం దాన్ని చంపి. ఆమ్మేయాలన్నది వాళ్ల ప్లాన్.. చివరి నిమిషంలో విషయం తెలుసుకుని.. అప్పోలినేర్ బృందం పికిన్‌తో పాటు మరికొన్నిటిని కాపాడారు.
వాటిని కెమరూన్‌లోని నేషనల్ పార్క్‌కు తరలించాలనుకున్నారు. ఎంతైనా అడవి గొరిల్లాలు. దీంతో వాటికి మత్తుమందు ఇచ్చారు. అప్పో పికిన్‌ను వేరే ఎన్‌క్లోజర్‌లోకి మారుస్తుండగా.. అది మెలకువలోకి వచ్చింది. అయితే.. ఆశ్చర్యకరంగా పికిన్ వైల్డ్‌గా ప్రవర్తించలేదు.. చాలా ప్రశాంతంగా ఉంది.. తనను రక్షించిన అప్పోను గుర్తించినట్లుగా.. అతడిని పట్టుకుని అలా ఉండిపోయింది.. ఏదో కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా.. ఇది ఇద్దరు మిత్రుల మధ్య చోటుచేసుకున్న ఓ అద్భుతమైన సన్నివేశం’అని జొఆన్ చెప్పారు. వన్యప్రాణుల పట్ల మరింత దయతో ప్రవర్తించేలా తన ఈ చిత్రం దోహదం చేస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment