Peoples Choice Award
-
ఆర్టీసీకి ‘ప్రవాస్ 4.ఓ రెడ్‌బస్ పీపుల్స్ చాయిస్’ అవార్డు
సాక్షి, అమరావతి: వరుసగా రెండో ఏడాది ఏపీఎస్ ఆర్టీసీ ‘ప్రవాస్ 4.ఓ రెడ్‌బస్ పీపుల్స్ చాయిస్ అవార్డు’ను సాధించింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తున్నందుకు గాను ఈ అవార్డును ప్రకటించారు. ప్రవాస్ 4.ఓ అవార్డును సాధించడంపై ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్టీసీ అధికారులు, సిబ్బందిని శుక్రవారం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు కేఎస్ బ్రహా్మనందరెడ్డి, చంద్రశేఖర్, వి.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
మంచు పాన్పు
చలికాలపు రాత్రి నిద్రొస్తే మనమంతా బిర్రుగా ముసుగు తన్నిపడుకుంటాం. కానీ ఈ మంచు ఎలుగుబంటి మాత్రం సుఖమనిన ఇదియెగాద అనుకుంటూ మంచుపాన్పుపై హాయిగా నిద్రపోయింది. ఐస్‌బర్గ్‌పై ఎలుగు నిద్రపోతున్న ఫొటోను బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ నీమా సరిఖానీ తీశారు. ఈ ఫొటో.. పీపుల్స్ ఛాయిస్ సంస్థ చేపట్టిన ఓటింగ్‌లో పాల్గొన్న వేలాది మందికి తెగ నచ్చేసింది. దీంతో నీమాను పీపుల్స్ ఛాయిస్ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారంతో సత్కరించారు. నార్వేకు చెందిన స్వాల్బార్డ్ ద్వీపసమూహంలో ఉత్తర ధృవానికి అత్యంత సమీప ఐస్‌బర్గ్‌ల వద్ద ఈ ఫొటోను తీశారు. -
థాంక్ యు అప్పో...
అప్పటివరకూ గట్టిగా కొట్టుకున్న పికిన్ గుండె ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది.. అప్పోను గట్టిగా పట్టుకుంది.కొన్ని నిమిషాల క్రితం వరకూ అప్పో ఎవరో పికిన్కు తెలియదు..కానీ ఇప్పుడీ ప్రపంచంలో అందరికంటే ఎంతో ఆప్తుడిలా కనిపిస్తున్నాడు..అప్పో దగ్గరుంటే..అమ్మ దగ్గరున్నట్లుంది..ఎలాంటి భయం లేకుండా.. భద్రంగా..అచ్చం అమ్మ కడుపులో ఉన్నట్లు..అమ్మ జన్మనిస్తే.. అప్పో పునర్జన్మనిచ్చాడు.. థాంక్ యు అప్పో.. పికిన్–అప్పోల ఈ చిత్రం వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2017లో ప్రతిష్టాత్మక పీపుల్స్ చాయిస్ పురస్కారాన్ని గెలుచుకుంది. 50 వేల ఎంట్రీలు రాగా.. కెనడాకు చెందిన ఫొటోగ్రాఫర్ జొఆన్ తీసిన ఈ చిత్రం మొదటి స్థానాన్ని గెలుచుకుంది. ‘ఇద్దరు స్నేహితుల అపురూపమైన చిత్రమిది. పికిన్ ఓ గొరిల్లా.. అప్పోలినేర్ ఏప్ ఆఫ్రికా తరఫున పనిచేస్తుంటాడు. పికిన్ను కొందరు వేటగాళ్లు పట్టుకున్నారు. మాంసం కోసం దాన్ని చంపి. ఆమ్మేయాలన్నది వాళ్ల ప్లాన్.. చివరి నిమిషంలో విషయం తెలుసుకుని.. అప్పోలినేర్ బృందం పికిన్తో పాటు మరికొన్నిటిని కాపాడారు. వాటిని కెమరూన్లోని నేషనల్ పార్క్‌కు తరలించాలనుకున్నారు. ఎంతైనా అడవి గొరిల్లాలు. దీంతో వాటికి మత్తుమందు ఇచ్చారు. అప్పో పికిన్ను వేరే ఎన్‌క్లోజర్‌లోకి మారుస్తుండగా.. అది మెలకువలోకి వచ్చింది. అయితే.. ఆశ్చర్యకరంగా పికిన్ వైల్డ్‌గా ప్రవర్తించలేదు.. చాలా ప్రశాంతంగా ఉంది.. తనను రక్షించిన అప్పోను గుర్తించినట్లుగా.. అతడిని పట్టుకుని అలా ఉండిపోయింది.. ఏదో కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా.. ఇది ఇద్దరు మిత్రుల మధ్య చోటుచేసుకున్న ఓ అద్భుతమైన సన్నివేశం’అని జొఆన్ చెప్పారు. వన్యప్రాణుల పట్ల మరింత దయతో ప్రవర్తించేలా తన ఈ చిత్రం దోహదం చేస్తుందని ఆశిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. -
అలలై... రంగుల కలలై!
ప్రపంచం నలుమూలల నుంచి కెనాడాలోని ప్రముఖ నగరం టోరంటోలో రెక్కలు కట్టుకొని వాలిన ప్రేక్షకులు చిన్నబోయిన రోజు ఇది. కాదా మరి! సెప్టెంబర్ 6 - సెప్టెంబర్ 16 కు మధ్య ఎన్నెన్ని గొప్ప సినిమాలు చూశారు! ఇక రేపు అవార్ట్ల హడావిడి తప్ప సినిమాలేవీ! 72 దేశాల నుంచి వచ్చిన 372 చిత్రాలను ఈ టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. అవి సినిమాలు మాత్రమే కాదు... రకరకాల భావోద్వేగాలతో ప్రపంచాన్ని ఒకటి చేసిన వెండితెర మాధ్యమాలు. సినిమాలతో పాటు ప్రేక్షకు లకు లభించిన మరో బహుమతి... ఫెస్టివల్‌కు వచ్చిన 4000 మంది ప్రసిద్ధ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్. సినిమా ప్రదర్శన తరువాత... వారితో మాట్లాడడం అంటే... సినిమాకు సంబంధించి ఒకే సమయంలో పది నాణ్యమైన పుస్తకాలు చదివినట్లే. ఆ అదృష్టాన్ని చాలామంది వినియోగించుకొని ఆనందపడిపోయారు. ది బ్రైట్ డే, గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్, ఇష్క్‌జాదే, మిస్ లవ్లీ, ముంబాయిస్ కింగ్స్... మొదలైన మన దేశానికి సంబంధించిన చిత్రాలను ఈ ఫెస్టివల్లో ప్రదర్శించారు. డేవిడ్ ఒ. రసెల్ ‘సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్’ ‘పీపుల్స్ ఛాయిస్ అవార్డ్’ అందుకుంది. -
భువన్ కు పీపుల్స్ ఛాయిస్ అవార్డు
దుబాయ్: టీమిండియా మీడియం పేసర్ భువనేశ్వర్ కుమార్ ఈ ఏడాది ఐసీసీ 'పీపుల్స్ ఛాయిస్ అవార్డు' గెల్చుకున్నాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ అవార్డు దక్కించుకున్న నాలుగో క్రికెటర్ గా భువనేశ్వర్ నిలిచాడు. ఇంగ్లండ్ మహిళా క్రికెట్ కెప్టెన్ షార్లెట్ ఎడ్వార్డ్స్, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్, శ్రీలంక కెప్టెన్ మాథ్యూస్, దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ పోటీ పడినప్పటికీ భువన్ కే అవార్డు దక్కింది. తనకు ఓటు వేసిన వారందరికీ భువనేశ్వర్ ధన్యవాదాలు తెలిపాడు. 2010లో ఈ అవార్డును ప్రవేశపెట్టారు. అదే ఏడాది సచిన్ టెండూల్కర్ ఈ పురస్కారం అందుకున్నాడు. శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర వరుసగా రెండుసార్లు(2011, 2012) ఈ అవార్డు దక్కించుకున్నాడు. 2013లో మహేంద్ర సింగ్ ధోని ఈ అవార్డుకు ఎంపికైయ్యాడు. -
నాకు అవార్డు వచ్చింది.. లైక్స్ కొట్టండోయ్..
సీరియస్‌గా ఫేస్బుక్లో స్టేటస్ అప్డేట్ చేస్తున్నట్లు కనిపిస్తున్న ఈ కోతి చిత్రం ఇప్పటికే ఎందరినో ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్నీ గెలుచుకుంది. నేచురల్ హిస్టరీ మ్యూజియం, బీబీసీ వారు కలిసి నిర్వహించిన వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2014లో పీపుల్స్ చాయిస్ అవార్డును ఇది సొంతం చేసుకుంది. ప్రజల నుంచి వచ్చిన ఓట్ల ఆధారంగా దీన్ని ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ మార్సెల్ ఊస్టన్ తీశారు. జపాన్‌లోని జిగోకుడానీ కోతుల పార్క్‌లో ఓ పర్యాటకుడు కోతికి దగ్గరగా వెళ్లి ఫొటో తీయడానికి ప్రయత్నించినప్పుడు ఆ వానరం అతడి చేతిలోని ఫోన్ ఎత్తికెళ్లిపోయిందని.. దాంతో అది ఆడుకుంటున్నప్పుడు తీసినదే ఈ చిత్రమని మార్సెల్ తెలిపారు.