అలలై... రంగుల కలలై!
ప్రపంచం నలుమూలల నుంచి కెనాడాలోని ప్రముఖ నగరం టోరంటోలో రెక్కలు కట్టుకొని వాలిన ప్రేక్షకులు చిన్నబోయిన రోజు ఇది. కాదా మరి! సెప్టెంబర్ 6 - సెప్టెంబర్ 16 కు మధ్య ఎన్నెన్ని గొప్ప సినిమాలు చూశారు! ఇక రేపు అవార్ట్‌ల హడావిడి తప్ప సినిమాలేవీ! 72 దేశాల నుంచి వచ్చిన 372 చిత్రాలను ఈ టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. అవి సినిమాలు మాత్రమే కాదు... రకరకాల భావోద్వేగాలతో ప్రపంచాన్ని ఒకటి చేసిన వెండితెర మాధ్యమాలు.
సినిమాలతో పాటు ప్రేక్షకు లకు లభించిన మరో బహుమతి... ఫెస్టివల్‌కు వచ్చిన 4000 మంది ప్రసిద్ధ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్. సినిమా ప్రదర్శన తరువాత... వారితో మాట్లాడడం అంటే... సినిమాకు సంబంధించి ఒకే సమయంలో పది నాణ్యమైన పుస్తకాలు చదివినట్లే. ఆ అదృష్టాన్ని చాలామంది వినియోగించుకొని ఆనందపడిపోయారు. ది బ్రైట్ డే, గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్, ఇష్క్‌జాదే, మిస్ లవ్లీ, ముంబాయిస్ కింగ్స్... మొదలైన మన దేశానికి సంబంధించిన చిత్రాలను ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. డేవిడ్ ఒ. రసెల్ ‘సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్’ ‘పీపుల్స్ ఛాయిస్ అవార్డ్’ అందుకుంది.