అమెరికాతో బంధం మరింత బలోపేతం
ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ
వాషింగ్టన్: గత కొన్ని దశాబ్దాలు భారత్– అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వృద్ధి చెందడంతో పాటు బలోపేతమయ్యాయని, ఇరు దేశాల్లో ప్రభుత్వాలు మారినా ద్వైపాక్షిక సంబంధాలపై పెద్దగా ప్రభావం పడలేదని ఆర్థిక మంత్రి జైట్లీ అన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా శనివారం భారత రాయబారి నవ్‌తేజ్ సర్నా ఇచ్చిన విందులో జైట్లీ పాల్గొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ట్రంప్ సర్కారుతో కలసి పనిచేసేందుకు భారత ప్రభుత్వం ఎదురుచూస్తోందని జైట్లీ అన్నారు. భారత్–అమెరికాల మధ్య సంబంధాలకు ఇరు దేశాల్లోను మద్దతు ఉందని, అమెరికాలోని కొత్త ప్రభుత్వంతో సంబంధాలు కొనసాగించడం భారత్‌కు లాభిస్తుందనే నమ్మకం వ్యక్తంచెప్పారు. ఆదివారం అమెరికా రెవెన్యూ మంత్రితో జైట్లీ భేటీ కానున్నారు.
ఆశాజనకంగా ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాలు
అమెరికాలో పర్యటిస్తోన్న భారత ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తున్న జైట్లీ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. అలాగే జీ–20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశంలోను పాల్గొంటారు. గత మూడేళ్లతో పోల్చితే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు సమావేశాలు ఈ ఏడాది ఆశాజనకంగా జరిగాయని జైట్లీ చెప్పారు. భారతదేశ వృద్ధి రేటుపై మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతున్నా సరే... గత మూడేళ్లలో ఏడు నుంచి 8 శాతం వృద్ధి రేటుతో భారత్ ముందుకు సాగిందని, ఇతర ఆర్థిక సూచీలు ఆశాజనకంగానే ఉన్నాయన్నారు.