కెన్యాతో రక్షణ బంధం
భద్రత, ద్వంద్వ పన్నుల రద్దు సహా ఏడు ఒప్పందాలు
- కెన్యాకు భారత రుణ సాయం రూ. 302 కోట్లకు పెంపు
- కెన్యా అధ్యక్షుడు కెన్యెట్టాతో చర్చల తర్వాత మోదీ వెల్లడి
నైరోబి : పలు రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవటంతో పాటు విస్తరించాలని భారత్, కెన్యా నిర్ణయించాయి. అందులో భాగంగా రక్షణ, భద్రత రంగం, ద్వంద్వ పన్నుల రద్దు సహా ఏడు ఒప్పందాలు చేసుకున్నాయి. ఆఫ్రికా పర్యటనలో భాగంగా కెన్యా వెళ్లిన ప్రధాని నరేంద్రమోదీ.. సోమవారం ఆ దేశాధ్యక్షుడు ఉహురు కెన్యెట్టాతో చర్చలు జరిపారు. అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. కెన్యాలో చిన్న, మధ్య తరహా సంస్థలు, జౌళి పరిశ్రమల అభివృద్ధికి సాయంగా రాయితీతో కూడిన రుణాన్ని రూ. 302 కోట్లకు పెంచుతున్నట్లు మోదీ తెలిపారు. అలాగే.. కెన్యాలో నాణ్యమైన, అందుబాటు ధరలో ఉండే వైద్యసేవలను అందించేందుకు కేన్సర్ ఆస్పత్రిని భారత్ నిర్మిస్తుందన్నారు.
ఈ బహుముఖ అభివృద్ధి భాగస్వామ్యం మన ద్వైపాక్షిక సంబంధాలకు మూల స్తంభమని అభివర్ణించారు ‘సైబర్ భద్రత, మాదకద్రవ్యాలు, మత్తుపదార్థాలు, మనుషుల క్రయవిక్రయాలపై పోరాటం రంగాల్లో మా భద్రతా భాగాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించాం’ అని తెలిపారు. మోదీ గౌరవార్థం కెన్యెట్టా విందు ఇచ్చారు. వ్యవసాయం, ఆరోగ్య పరిరక్షణ, విద్యావసరాలు, వృత్తి విద్య, శిక్షణ, చిన్న వ్యాపారాల అభివృద్ధి, పునర్వినియోగిత ఇంధనశక్తి, విద్యుత్ సరఫరా, వ్యవస్థాగత సామర్థ్యాల నిర్మాణం తదితర రంగాల్లో భారత నైపుణ్యాలు, అనుభవాలను కెన్యాతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మోదీ చెప్పారు. రక్షణ సహకారంపై కుదిరిన అవగాహనా ఒప్పందంలో.. సిబ్బంది పరస్పర సందర్శనలు, నైపుణ్యం ఇచ్చిపుచ్చు కోవటం, శిక్షణ, సముద్ర రంగంలో సహకారం, పరికరాల సరఫరా తదితర అంశాలున్నాయి. రక్షణ సహకారం, ద్వంద పన్నుల రద్దు, కెన్యాకు రుణ సాయాల సమీక్షపై రెండు ఒప్పందాలతో పాటు వీసా, గృహనిర్మాణం, కొలతల ప్రమాణాలపై మూడు ఒప్పందాలు కుదిరాయి.
విద్వేష బోధకులతో ప్రమాదం: మోదీ
నైరోబీ: విద్వేషాన్ని, హింసను బోధించేవారు సమాజానికి ప్రమాదకరంగా పరిణమించారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ ఉగ్ర బోధనలు తమకు స్ఫూర్తినిచ్చాయంటూ ఇటీవల ఢాకాలోని ఒక కెఫెలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులు పేర్కొన్న నేపథ్యంలో.. ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న వారిని, ఉగ్రవాదులను రాజకీయ పనిముట్లుగా వాడుకుంటున్న వారిని అడ్డుకోవాలంటూ పరోక్షంగా పాకిస్తాన్‌పై కూడా మోదీ విమర్శనాస్త్రాలు సంధించారు. నైరోబిలోని యూనివర్సిటీ ఆఫ్ నైరోబి విద్యార్థులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
విద్వేషం, హింస, ఉగ్రవాదం లేని ప్రపంచాన్ని ఈ సందర్భంగా మోదీ ఆకాంక్షించారు. ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు పొందేందుకు భద్రతతో కూడిన సమాజాలు అవసరమన్నారు. ఉగ్రవాద సిద్ధాంతాలను ఎదుర్కొనే విషయంలో యువత కీలక పాత్ర పోషించాల్సి ఉందని మోదీ పేర్కొన్నారు. భారతదేశం ఎదుగుతుండటానికి కారణం దేశంలోని 80 కోట్ల మంది యువతేనంటూ.. తానూ వారిలో ఒకరినన్నారు. ‘‘ఎందుకంటే నేను హృదయంలో 20 ఏళ్ల యువకుడినే’’ అని నవ్వుతూ వ్యాఖ్యానించారు. మొత్తం 42 జాతులున్న కెన్యాలో భారత సంతతి ప్రజలను 43వ తెగగా పరిగణిస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు.