తల చుట్టూ దుపట్టాతో కొత్త మేకోవర్!
లాగోస్, (నైజీరియా): అందమైన కుందనాల బొమ్మ.. చూడగానే ముద్దొచ్చే చక్కని బొమ్మ. మోడ్రన్ దుస్తులు ధరించినా.. సంప్రదాయబద్ధమైన వస్త్రాలతో ముస్తాబైన ఆ బొమ్మ మగువకు ప్రతిరూపంగా నిలుస్తుంది. ఆ బొమ్మే పిల్లలకు ఎంతో ఇష్టమైన బార్బీ డాల్. ఈ కుందనాల బొమ్మ ఇప్పుడు సరికొత్త రూపుతో సోషల్ మీడియలో హల్‌చల్ చేస్తోంది. తలచుట్టూ దుపట్టా కప్పుకొని అచ్చమైన ముస్లిం సంప్రదాయ యువతి రూపులో బార్బీ బొమ్మ తాజాగా హల్‌చల్ చేస్తోంది.
నిజానికి బార్బీ బొమ్మ రూపురేఖల్లో గత నెలకాలంలో ఎంతోమార్పు వచ్చింది. శరీర వర్ణంతోపాటు దుస్తులు, డిజైన్ విషయంలో పలు మార్పులు చేసింది. ఈ నేపథ్యంలోనే ఓ నైజీరియన్ వైద్య విద్యార్థిని హానీఫా ఆదం బార్బీ బొమ్మకు సంప్రదాయబద్ధమైన ముస్లిం రూపురేఖలు అద్దింది. తలచుట్టూ దుపట్టా కప్పుకొని ముస్లిం యువతిలా సంప్రదాయబద్ధంగా కనిపించే బార్బీ బొమ్మలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ వచ్చింది. ఈ ఫొటోలతో సోషల్‌మీడియలో హల్‌చల్ చేస్తుండటంతో హనీఫా ఇప్పుడు స్టార్‌గా మారిపోయింది. బ్రిటన్‌లో ఫార్మాకాలజీలో మాస్టర్స్ చదువుతున్న నైజీరియన్ విద్యార్థిని హానీఫా బార్బీ బొమ్మ తనకెంతో స్ఫూర్తినిచ్చిందని, అందుకే ఆ కుందనాల బొమ్మకు అచ్చమైన ముస్లిం సంప్రదాయబద్ధమైన రూపు ఇవ్వడం అవసరంగా తాను భావించానని, అందుకే బురఖాతోపాటు వివిధ ముస్లిం సంప్రదాయ దుస్తుల్లో బార్బీని తీర్చిదిద్ది పోస్టు చేస్తున్నానని ఆమె చెప్తోంది.