నేపాల్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం
అవిశ్వాసాన్ని ఎదుర్కోవడానికి ముందే ప్రధాని పదవికి కేపీ ఓలి రాజీనామా.. కొత్త ప్రధానిగా ప్రచండ!
కఠ్మాండు : నేపాల్‌లో మళ్లీ రాజకీయ సంక్షోభం నెలకొంది. పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి ముందే ఆదివారం సాయంత్రం ప్రధానమంత్రి కేపీ ఓలి(64) తన పదవికి రాజీనామా చేశారు. ఓలి గత ఏడాది అక్టోబర్‌లో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. గత పదేళ్లలో ఓలి ప్రభుత్వం ఎనిమిదోది. సంకీర్ణ ప్రభుత్వానికి మావోయిస్టులు మద్దతు ఉపసంహరించడంతో ఓలి అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే కూటమిలోని మధేసి పీపుల్స్ రైట్స్ ఫోరమ్, డెమోక్రటిక్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలు ఓలి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ నేపాలీ కాంగ్రెస్(ఎన్‌సీ), మావోయిస్ట్ సెంటర్(సీపీఎన్) ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతివ్వడంతో ఓలి ప్రభుత్వం మైనారిటీలో పడింది. దీంతో ఓలి తన పదవికి రాజీనామా చేశారు.
ఆదివారం పార్లమెంటులో ఓలి ప్రసంగిస్తూ ‘‘పార్లమెంట్ కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు అవకాశం ఇవ్వాలనుకున్నాను. రాజీనామాను అధ్యక్షుడికి అందజేశాన’ని తెలిపారు. దేశాన్ని ప్రయోగశాలగా మార్చేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నాయని ఆరోపించారు. కొత్త రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేయకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే తన ప్రభుత్వాన్ని కూలదోశారని, దీనికి దేశం తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. గత ఏడాది సంభవించిన భూకంపం.. ఇతర ఇబ్బందుల నుంచి దేశం కుదుటపడుతున్న సమయంలో పదవి నుంచి వైదొలగాల్సి రావడం బాధ కలిగిస్తోందని చెప్పారు. మంచి పనులు చేస్తున్నందునేఈ విధంగా శిక్షించారని ఆరోపించారు.
తాను బాధ్యతలు స్వీకరించే సమయానికి భారత్‌తో నేపాల్ సంబంధాలు బలహీనంగా ఉన్నాయని, వాటిని పునరుద్ధరించి సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేశానని చెప్పారు. తన చర్యల కారణంగా ఏదో ఒక దేశంపై నేపాల్ ఆర్థికంగా ఆధారపడకుండా పరిస్థితులు మారాయని, దేశం, ప్రజల శ్రేయస్సు కోసమే పొరుగుదేశాలతో సత్సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేశానని చెప్పారు. అవిశ్వాస తీర్మానం అనేది చూసేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో కనిపిస్తున్నా.. దాని సారం మాత్రం కుట్రపూరితమైనదని ఆరోపించారు. కాగా, ఓలి స్థానంలో మావోయిస్టు చీఫ్ ప్రచండ ప్రధాని బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.